జమిలి ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
జమిలి ఎన్నికలపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జమిలి ఎన్నికలపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 13 Dec 2024 6:46 AM GMTజమిలి ఎన్నికల బిల్లుపై వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. నేడు, రేపు దానిపై లోక్‌సభలో చర్చ జరగనుంది. 2027లోనే జమిలి ఎన్నికలు నిర్వహించేలా కేంద్రం ముందుకు సాగుతోంది. ఈ మేరకు ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగానూ హాట్ టాపిక్ అయింది.
జమిలి ఎన్నికలపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జమిలి ఎన్నికలపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలపై కేంద్రం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చేసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్న కేంద్రం.. దేశవ్యాప్తంగా ఒకేసారి అసెంబ్లీలను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. దీనిపై పార్టీ నేతలం అందరం కూర్చొని చర్చిస్తామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకు పోతుందో స్పష్టతనివ్వాలన్నారు కేటీఆర్. ఎన్నికలపై మరిన్ని వివరాలు ఇవ్వాలని, పార్టీల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని పేర్కొన్నారు. మూడు నెలల క్రితమే పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయని, జమిలి ఎన్నికలు అంటే అన్ని రాష్ట్రాలతో కలిపి నిర్వహించడమే అని అన్నారు. అలాంటప్పుడు వచ్చే జనవరి, ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయని, వీటి టర్మ్‌లపై ఏం చేయబోతున్నారని కేంద్రం నుంచి స్పష్టత ఇవ్వాలన్నారు.
అలాగే.. ముందుముందు జనాభా లెక్కలతో పాటు సీట్ల పునర్విభజన సైతం జరగాల్సి ఉందని కేటీఆర్ అన్నారు. మహిళా రిజర్వేషన్‌ను సైతం అమలు చేయాల్సి ఉందన్నారు. 2017లో జమిలి ఎన్నికలపై పీఎం మోడీ ప్రతిపాదించినప్పుడు అఖిలపక్ష సమావేశంలో తాను కూడా మద్దతు ఇచ్చినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. ఏడేళ్ల తరువాత ఇప్పుడు ప్రతిపాదన వచ్చిందని, అయితే బిల్లు ఏ రూపంలో ఉందని తెలియదని అన్నారు. వీటిపై కేంద్రం స్పష్టత ఇస్తే.. బీఆర్ఎస్ కూడా జమిలి ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.