కంగనాపై దానం అనుచిత వ్యాఖ్యలు... గతం గుర్తు చేసిన కేటీఆర్!
అధినేతల మన్ననలు పొందాలనో.. లేక, ఆ సమయానికి విజ్ఞత గుర్తుకురాకో తెలియదు కానీ.. చాలా మంది నేతలు శృతిమించిన విమర్శలు చేస్తుంటారు.
By: Tupaki Desk | 20 Sep 2024 3:52 AM GMTఅధినేతల మన్ననలు పొందాలనో.. లేక, ఆ సమయానికి విజ్ఞత గుర్తుకురాకో తెలియదు కానీ.. చాలా మంది నేతలు శృతిమించిన విమర్శలు చేస్తుంటారు. దీంతో... సంస్కారం విడిచి మాట్లాడుతున్నారనే కామెంట్లను సొంతం చేసుకుంటుంటారు. బీజేపీ మహిళా ఎంపీ కంగనా రనౌత్ పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఈ కోవలోనే చూస్తూ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కేటీఆర్.
అవును... రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అత్యంత సహజం. అయితే.. అవి శృతి మించినా, విజ్ఞత మరిచినట్లు అనిపించినా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రమాదాలు పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలో... "సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా రనౌత్ కు రాహుల్ గాందీని విమర్శించే నైతిక హక్కు లేదు" అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.
ఓ మహిళా ఎంపీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమయంలో... ఈ వ్యాఖ్యలపై బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కంగనాపై దానం వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. మహిళలను కించపరిచే విధంగా రాజకీయాలు ఉండకూడదని సూచించారు.
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పట్ల దానం నాగేందర్ ఉపయోగించిన నీచమైన భాష ఆమోదయోగ్యం కాదని కేటీఆ ర్ పేర్కొన్నారు. కంగనా అభిప్రాయాలను.. ఆమె పార్టీ ఐడియాలజీతోనూ తాను ఏకీభవించను కానీ.. ఇలా దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా దానం వ్యాఖ్యలపై మౌనం వహించడం షాకింగ్ గా ఉందని అన్నారు.
ఈ సందర్భంగా... గతంలో అస్సో సీఎం హిమంత్ బిస్వా శర్మ.. సోనియా గాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తెలంగాణలోని సొంతపార్టీ సభ్యులు, రేవంత్ రెడ్డి స్పందించకముందే కేసీఆర్ స్పందించారని.. సోనియాను అవమానించేలా హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలను రేవంత్ కంటే ముందే కేసీఆర్ ఖండించారని గుర్తు చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. తాము నీతి, మర్యాదకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
ఈ సమయంలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా స్పందించిన కేటీఆర్... క్రూరమైన నేరం.. క్రూరమైన నేరమే! అది రేప్ కావొచ్చు, మర్డర్ కావొచ్చు.. మహిళలను కించపరిచేలా మాట్లాడటం కూడా నేరమే.. అని చెబుతూ... మీ పార్టీలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలని, పార్టీ కేడర్ కు విలువలు నేర్పించాలని సూచిస్తున్నట్లు తెలిపారు. మహిళలను గౌరవించడం మర్యాదకు సంబంధించిన అంశమని ఆయన స్పష్టం చేశారు.