Begin typing your search above and press return to search.

అప్పు లెక్క కేటీఆర్ చెబితే బాగుంటుందా?

కొందరికి కొన్ని అస్సలు సూట్ కావు. ఆ విషయాన్ని బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరైన కేటీఆర్ అస్సలు పట్టించుకోవట్లేదు.

By:  Tupaki Desk   |   5 Dec 2024 4:09 AM GMT
అప్పు లెక్క కేటీఆర్ చెబితే బాగుంటుందా?
X

కొందరికి కొన్ని అస్సలు సూట్ కావు. ఆ విషయాన్ని బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరైన కేటీఆర్ అస్సలు పట్టించుకోవట్లేదు. అందుకే ఆయన చేసే వ్యాఖ్యలు.. రేవంత్ సర్కారును లక్ష్యంగా చేసుకొని డైలీ బేసిస్ లో చేసే విమర్శలకు పెద్ద ప్రాధాన్యత లేకుండా పోతోంది. తాజాగా అలాంటి ప్రయత్నమే మరొకటి చేశారు కేటీఆర్. పదకొండు నెలల వ్యవధిలో రేవంత్ సర్కారు రూ.లక్ష కోట్ల అప్పు చేసినట్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న అప్పు మీద శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ తెచ్చిన రుణాలు రూ.4.26 లక్షల కోట్లు మాత్రమేనని.. తమను విమర్శిస్తున్నట్లుగా రూ.7 లక్షల కోట్ల అప్పు చేయలేదని చెబుతున్నారు. ఓవైపు అప్పుల గురించి మాట్లాడుతూనే.. మరోవైపు తాను అప్పుల మీద కాదు రేవంత్ సర్కారు తప్పుల మీద మాట్లాడతానంటూ చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు కేటీఆర్ లో మిస్ అవుతున్న క్లారిటీ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

రేవంత్ సర్కారు కొలువు తీరిన రెండో రోజు నుంచే విమర్శల్ని స్టార్ట్ చేసిన కేటీఆర్.. తరచూ ఏదో ఒక అంశంపై విరుచుకుపడటం తెలిసిందే. అయితే.. ఆయన స్పందిస్తున్న పలు అంశాలు కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో బోలెడన్ని చోటు చేసుకోవటం.. అప్పట్లో తమను విమర్శించిన వారిపై విమర్శలు సంధించటంతో పాటు.. వారిపై పవర్ ఫుల్ గా విరుచుకుపడటం తెలిసిందే.

తాము అధికారంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహరించిన కేటీఆర్.. విపక్షంలో ఉన్న వేళలో అందుకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. రేవంత్ సర్కారు చేసిన అప్పుల గురించి మాట్లాడుతున్న కేటీఆర్ కు ఇప్పటికే రేవంత్ ప్రభుత్వంలోని ముఖ్యులు పలుమార్లు పంచ్ లు ఇవ్వటం తెలిసిందే. తాము చేస్తున్న అప్పుల్లో చాలా వరకు గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పుల్ని తీర్చేందుకు.. వడ్డీలు కట్టేందుకు వినియోగిస్తున్న వైనాన్ని వెల్లడిస్తున్న వైనం గులాబీ నేతల్ని ఆత్మరక్షణలో పడేలా చేస్తోంది.

ఇలాంటి వేళలో అప్పులపై కొత్త పంథాలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా రోటీన్.. రొడ్డు కొట్టుడు వ్యవహారంగా రేవంత్ సర్కారుపై విమర్శల్ని సంధిస్తే కేటీఆర్ కు మైలేజీ కంటే డ్యామేజే ఎక్కువన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. ఇక.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై తాము వడ్డీలు కడుతున్నట్లుగా రేవంత్ సర్కారు చెబుతున్న మాటల్లో అబద్దాలు ఉన్నాయంటున్నారు కేటీఆర్.

రేవంత్ సర్కారు చెబుతుననట్లుగా ప్రతి నెలా రూ.6500 కోట్లు వడ్డీలు.. అప్పుల కోసం కడుతున్నట్లుగా చెబుతున్నప్పటికి అందులో నిజం లేదంటున్నారు కేటీఆర్. ‘ప్రతి నెలా రూ.6500 కోట్లు వడ్డీలు.. అప్పులు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. అదంతా శుద్ద అబద్ధం. ప్రతి నెలా కడుతున్నది రూ.2900 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.3600 కోట్లు ఎక్కడికి పోతున్నాయో ముఖ్యమంత్రి బదులివ్వాలి’ అంటూ చేసిన కేటీఆర్ వ్యాఖ్యల్ని చూస్తే.. ఆసక్తికర వాదన తెర మీదకు వస్తోంది.

మొత్తంగా రేవంత్ సర్కారు అప్పుల్ని తీర్చటం.. వడ్డీలు కట్టటం అన్న మాటలో నిజం ఉందన్న విషయం స్పష్టమవుతుంది. అదే సమయంలో లెక్కలో కాస్త తేడా ఉందన్నదే తప్పించి.. రేవంత్ సర్కారు అప్పులు తీరుస్తుందన్న మాటకు కేటీఆర్ సైతం నిజమేనన్న విషయాన్ని చెప్పినట్లైందని చెబుతున్నారు. కేటీఆర్ వాదనకు కౌంటర్ గా రేవంత్ సర్కారు గణాంకాల్ని విడుదల చేయటం ఖాయమంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ద్వారా కేటీఆర్ సాధించింది ఏమిటన్నది ప్రశ్నగామారింది.

రేవంత్ సర్కారు వైఫల్యాన్ని ఎత్తి చూపాలన్న ఆత్రుతతో కేటీఆర్ పడుతున్న ప్రయాసలోనూ అర్థం లేదంటున్నారు. ఏడాది పాలనను విజయవంగా ముగించిన నేపథ్యంలో విజయోత్సవాల తరహాలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సీఎం రేవంత్ పై కేటీఆర్ మండిపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను తామిచ్చినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుందని విమర్శించారు. తొలి ఏడాదిలో రేవంత్ సర్కారు 55,143 ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ప్రకటించగా.. అందులో నిజం లేదని.. 12వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినా.. రేవంత్ సర్కారు కావాలనుకుంటే వాటిని నిలిపి వేయొచ్చు. కానీ.. వాటిని కొనసాగించటం మంచి విషయమే కదా? కేసీఆర్ పదేళ్ల పాలనలో ఉద్యోగాల భర్తీ అస్సలు జరగలేదన్న వాదన వేళ.. రేవంత్ సర్కారు మొదటి ఏడాదిలో వారి ప్రభుత్వం చెప్పినట్లు కాకున్నా.. కేటీఆర్ చేసిన ప్రకటన ఆధారంగా చూసినా 12 వేల ఉద్యోగాలు ఇవ్వటం పెద్ద విషయమే కదా? కేటీఆర్ అనవసర ఆవేశం.. రేవంత్ సర్కారుకు వరంగా మారుతోందా? అన్నదిప్పుడు చర్చగా మారింది.