మాట్లాడితే బుక్ అవుతున్న కేటీఆర్
మొదట్లో కేటీఆర్ మాటలు పార్టీకి వరంగా భావించేవారు. తర్వాతి కాలంలో ఆయనలో వచ్చిన మార్పు.. మాటల్లో పెరిగిన అతివిశ్వాసం పార్టీకి శాపంగా మారాయి.
By: Tupaki Desk | 31 Dec 2024 5:30 AM GMTఆత్మవిశ్వాసం కొన్నిసార్లు అనవసరమైన తలనొప్పుల్ని తెచ్చి పెడుతుంది. అందుకు నిలువెత్తు నిదర్శనంగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ ను చెప్పాలి. అధికారం చేతికి వచ్చిన తొలినాళ్లలో ఆయన మాటలు విన్నప్పుడు ఒక విజనరీ నేత తెలుగు రాష్ట్రాలకు దొరికినట్లుగా కొందరు ఫీలయ్యేవారు. మాటల్లో స్పష్టత.. పక్కా టైమింగ్ తో పాటు.. ప్రత్యర్థులకు దొరకని రీతిలో తన వాదనకు లాజిక్ అండను తన వెంట ఉంచుకునేవారు. తర్వాతి కాలంలో ఆయనలో పెరిగిన ఆత్మవిశ్వాసం కాస్తా అతివిశ్వాసంగా మారింది. అదే ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ అహంకారం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
మొదట్లో కేటీఆర్ మాటలు పార్టీకి వరంగా భావించేవారు. తర్వాతి కాలంలో ఆయనలో వచ్చిన మార్పు.. మాటల్లో పెరిగిన అతివిశ్వాసం పార్టీకి శాపంగా మారాయి. అదెంతన్న విషయం ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాతే అర్థమైంది. అయినప్పటికి ఆయనలో మార్పు రాకపోవటం ఇప్పుడు ఇబ్బందిగా మారింది. బీఆర్ఎస్ సొంత మీడియా సంస్థకు చెందిన మీడియా ప్రతినిధులు సైతం తమ యువనేత ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న మాటల్ని బయట చెప్పుకోవటం చూస్తే.. ఆయన మాటలతో పార్టీకి జరుగుతున్న చేటు ఎంతన్నది అర్థమవుతుంది.
ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి కేటీఆర్ లో ఒకలాంటి ఫస్ట్రేషన్ ఎక్కువైందన్న మాట పలువురి నోట తరచూ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవికి మర్యాద.. గౌరవం ఇవ్వాలని గతంలో అదే పనిగా చెప్పిన కేటీఆర్ నోటి నుంచి సీఎం రేవంత్ పై అవాకులు..చవాకులు పేలే ధోరణి ఆయన్ను వేలెత్తి చూపేలా చేస్తోంది. తనను తాను చాంఫియన్ గా భావించే కేటీఆర్.. దూకుడు రాజకీయాల వేళ.. నోటికి వచ్చినట్లు మాట్లాడటంతోనే ప్రయోజనం ఉంటుందన్నట్లుగా ఆయన తీరు ఉంటుందని చెబుతున్నారు.
తాజాగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ పై మరోసారి విరుచుకుపడ్డారు. ఫార్ములా ఈ రేసు ఇష్యూలో ఆయన అరెస్టు అవుతారన్న ప్రచారంతో పాటు.. ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలోఆయన తన నోటికి మరింత పని చెబుతున్నారు. సీఎం రేవంత్ పాలనలో ఫెయిల్ అయి.. ఇచ్చిన హామీలను అమలు చేయలేక.. ప్రజల చూపు మరల్చేందుకు సినిమా వాళ్లపై మాట్లాడుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఒకవేళ.. అదే నిజమని అనుకుంటే.. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఎపిసోడ్ లో అల్లు అర్జున్ కు మద్దతు ఇచ్చేలా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రతికూలంగా మారాయి.
ఓపక్క బాధితులను పట్టించుకోకుండా.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టటాడుతున్న శ్రీతేజ్ ను పరామర్శించని కేటీఆర్.. అల్లు అర్జున్ కు మద్దతు మాట్లాడటం పార్టీకి డ్యామేజింగ్ గా మారిందన్న అభిప్రాయం ఉంది. సినిమా వాళ్లపై రేవంత్ మాట్లాడిన మాటలు.. పుష్ప ఎపిసోడ్ లో సీఎంకు మంచి మార్కులు పడినట్లుగా రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్న వేళ.. అందుకు భిన్నంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉండటం దేనికి నిదర్శనం? తన ఆలోచనలతోనే తాను ఉండటం తప్పించి.. బయటకు రాలేని కేటీఆర్ అర్జెంట్ గా మారాల్సిన అవసరం ఉందంటున్నారు. మాట్లాడే మాటల విషయంలోకాస్త ఆచితూచి అన్న ధోరణి మంచిదని.. లేకుంటే మరింత నష్టపోవటం ఖాయమంటూ గులాబీ వర్గాలు చేస్తున్న వ్యాఖ్యలు కేటీఆర్ వరకు ఎప్పటికి వెళతాయో?