Begin typing your search above and press return to search.

జమిలికి బీఆర్ఎస్ స్వాగతమేనా ?

కేంద్రం జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆమోదించింది.

By:  Tupaki Desk   |   19 Sep 2024 3:42 AM GMT
జమిలికి బీఆర్ఎస్ స్వాగతమేనా ?
X

కేంద్రం జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆమోదించింది. కేంద్ర మంత్రి వర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. శీతాకాల సమావేశాల్లో దీనిని పార్లమెంట్ ముందుకు తెచ్చి చట్టం చేయించుకుంటారు. ఇలా బీజేపీ వడివడిగా అడుగులు వేస్తుంది.

అయితే కేంద్ర మంత్రి వర్గం ఎపుడైతే జమిలి ఎన్నికలకు ఓకే అంటూ ముందుకు వచ్చిందో ఆ వెంటనే కాంగ్రెస్ దానిని ఖండించింది. జమిలి ఎన్నికలు ఈ దేశంలో అసాధ్యమని తేల్చేసింది. ఆ విధంగా జరగకూడదని కూడా తన మనసులో మాటను బయటపెట్టింది.

అంటే కాంగ్రెస్ భావన ఇదే అయితే ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీల ఆలోచనలు కూడా ఇలాగే ఉంటాయని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. వామపక్షాలు అయితే ఇది జాతీయ వాదాన్ని తెచ్చి ప్రాంతీయ వాదం మీద రాష్ట్రాల మీద రుద్దడం అని అంటున్నాయి.

మొత్తానికి బీజేపీకి ఇండియా కూటమి ఈ విషయంలో పూర్తి వ్యతిరేకం అని అర్ధం అయింది. మరో వైపు ఎన్డీయే పక్షాలు ఎలా రియాక్టు అవుతాయన్నది చూడాల్సి ఉంది. బీజేపీతో పాటు అనేక ఇతర పార్టీలు ఎన్డీయేలో ఉన్నాయి.

ఇంకో వైపు తటస్థ పార్టీల మీద అందరి చూపు పడుతోంది. తటస్థ పార్టీలు అంటే అటు ఎన్డీయే ఇటు ఇండియా కూటమిలో చేరనివి అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో అలా చూసుకుంటే ఏపీలో వైసీపీ తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నాయి. వైసీపీ జమిలి ఎన్నికల మీద తన స్టాండ్ ఏంటో ఇంకా చెప్పలేదు.

అయితే బీఆర్ఎస్ మాత్రం ఇండైరెక్ట్ గా అంగీకరించిందా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే సుమారుగా ఏడాది క్రితం తెలంగాణాలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కి జమిలి ఎన్నికల రూపంలో మరో చాన్స్ వస్తే నో అనకుండా ఉంటుందా అన్నదే అందరి మాట.

దీని మీద బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ కొంత నర్మగర్భంగా ట్వీట్ పెట్టారు. జమిలి ఎన్నికలు అంటున్నారు కదా దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలను రద్దు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. అది ఆయనకు వచ్చిన డౌటా లేక జమిలి విషయంలో కేంద్రం స్టెప్స్ ఏంటి అని తెలుసుకోవడమా అన్నది అయితే తెలియదు.

మరో వైపు జమిలి ఎన్నికల ప్రతిపాదన మీద కాంగ్రెస్ మాదిరిగా ఆయన స్ట్రైట్ గా కొట్టిపారేయకుండా తమ పార్టీలో చర్చించిన మీదటనే జమిలి ఎన్నికల మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జమిలి ఎన్నికలు అంటే తెలంగాణా ప్రభుత్వం కూడా రద్దు అవుతుంది. మళ్లీ ఎన్నికలు వస్తాయి అందుకే విపక్షంలోని బీఆర్ ఎస్ లాంటి పార్టీలకు సుముఖమే అని అంటున్నారు. మరి అధికారంలో ఉన్న పార్టీలకు మాత్రం ఇది ఇబ్బందికరమే అని అంటున్నారు. మొత్తానికి మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న తమతో పాటు ఎవరికీ అయిదేళ్ళూ గ్యారంటీలేదు అన్న చేదు సందేశాన్ని అందిస్తోంది.