హైదరాబాద్ టు యూకే... ఏమిటీ ఫార్ములా-ఈ రేస్ స్కామ్?
ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది.
By: Tupaki Desk | 20 Dec 2024 4:35 AM GMTనాటి మున్సిపల్ శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ ను ప్రధాన నిందితుడి (ఏ1) గా పేర్కొంటూ కేసు నమోదు చేసింది తెలంగాణ ఏసీబీ. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో నమోదైన ఈ కేసు ఎఫ్.ఐ.ఆర్.తో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు.
అవును... ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్ తో పాటు మున్సిపల్ శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ (ఏ2), హెచ్.ఎం.డీ.ఏ. అప్పటి చీఫ్ ఇంజినీర్ బీ.ఎల్.ఎన్. రెడ్డి (ఏ3) లనూ ఎఫ్.ఐ.ఆర్. లో చేరింది.
ఏమిటీ ఫార్ములా-ఈ రేస్ స్కామ్మ్..?
ఫార్ములా ఈ-రేసుల నిర్వహణ కోసం భారత చట్టాల ప్రకారం నమోదైన ‘ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్’.. యూకే చట్టాల ప్రకారం నమోదైన ‘ఫార్ములా-ఈ ఆపరేషన్స్’ (ఎఫ్.ఈ.ఓ) సంస్థ.. ‘తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేష్టన్ & అర్బన్ డెవలప్మెంట్’ మధ్య ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ కోసం అక్టోబర్ 25 - 2022న త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.
ఈ మూడింటి మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం... ఈవెంట్ నిర్వహణకు అయ్యే ఖర్చును స్పాన్సర్ అయిన ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భరించాలని.. ట్రాక్ ను హోస్ట్ సిటీ అయిన తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేష్టన్ & అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ సమయంలో ఫిబ్రవరి 11 - 2023న జరిగిన ఈ ఈవెంట్ కోసం ఎంఏయూడీ తరుపున హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ అథారిటీ (హెచ్.ఎం.డీ.ఏ) రూ.12 కోట్లు వెచ్చించగా.. రేసు నిర్వహణ ఖర్చును స్పాన్సర్ అయిన ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భరించింది. ఈ క్రమంలో... ఎఫ్.ఈ.వో., ఏస్ నెక్స్ట్ జెన్ మధ్య విభేధాలు తలెత్తాయి.
దీంతో... 2023 మే నాటికి రేసు నిర్వహణ ఖర్చుల చెల్లింపుల్లో బకాయిలు పేరుకుపోయాయి. ఈ సమయంలో.. హెచ్.ఎం.డీ.ఏ., ఎఫ్.ఈ.వో. మధ్య చర్చలు జరిగాయి. ఇందులో... స్పాన్సర్ ఆ సొమ్మును ప్రభుత్వం చెల్లించే అవకాశాలపై చర్చించారు. ఈమేరకు హెచ్.ఎం.డీ.ఏ. అప్పటి కమిషనర్ అరవింద్ కుమార్.. కేటీఆర్ కు ప్రతిపాదనలు పంపారు.
ఇందులో భాగంగా... స్పాన్సర్ గా ఏస్ నెక్స్ట్ జెన్ వైదొలగడంతో ప్రమోటర్ గానూ, హోస్ట్ సిటీగానూ హెచ్.ఎం.డీ.ఏ.నే వ్యవహరించాలని ప్రతిపాదించారు! దీనికి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ ఆమోదించారు. అనంతరం.. రుసుములు, పన్నుల కింద సుమారు రూ.110 కోట్లు (90 లక్షల గ్రేట్ బ్రిటన్ పౌండ్లు) మంజూరు చేశారు.
వీటితో పాటు పాటు రేసు నిర్వహణకు అయ్యే పనుల నిమిత్తం మరో రూ.50 కోట్లు మంజూరు చేశారు.
హైదరాబాద్ టు యూకే మనీ ట్రన్స్ ఫర్!:
హెచ్.ఎం.డీ.ఏ., ఎఫ్.ఈ.వో. మధ్య జరిగిన ఒప్పందం మేరకు ప్రమోటర్ ఛార్జెస్ కింద మొదటి వాయిదాగా రూ.22.69 కోట్లు, రెండో వాయిదాగా రూ.23.01 కోట్లతో పాటు టాక్సులు, కమిషన్లూ చెల్లించాలని ఎఫ్.ఈ.వో. నుంచి హెచ్.ఎం.డీ.ఏ. కు ఇన్వాయిస్ లు అందాయి. దీంతో.. అక్టోబర్ 3 - 2023న మొదటి వాయిదా, అదే నెల 11న రెండో వాయిదా సొమ్ము చెల్లించాలని నిర్ణయించారు.
ఈ మేరకు హెచ్.ఎం.డీ.ఏ. అప్పటి చీఫ్ ఇంజినీర్ బీ.ఎల్.ఎన్. రెడ్డి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దీంతో... అక్టోబర్ 11 - 2023న హైదరబాద్ లోని హిమాయన్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి యూకే ఎఫ్.ఈ.వో. అకౌంట్ కు నేరుగా మొత్తం సొమ్ము బదిలీ అయ్యింది. ఈ సమయంలో.. విదేశీమారకద్రవ్యం చెల్లింపులకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు!
దీంతో... హెచ్.ఎం.డీ.ఏ అదనంగా ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు రూ.8.06 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. మరోవైపు ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు పర్మిట్ ఫీజు, ఇంటర్ స్టేట్ ఛాంపియన్ షిప్ రుసుం కింద హెచ్.ఎం.డీ.ఏ. రూ.1.10 కోట్లు చెల్లించింది!
అయితే... హెచ్.ఎం.డీ.ఏ నిబంధనల ప్రకారం రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఎవరికైనా చెల్లించాల్సి వస్తే తప్పనిసరిగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి! అయితే.. అలాంటి అనుమతులు ఏమీ లేకుండానే సాధారణ నిధుల నుంచి మొత్తం రూ.54.88 కోట్లు చెల్లించింది హెచ్.ఎం.డీ.ఏ.. అని ఏసీబీ ఎఫ్.ఐ.ఆర్. లో పేర్కొంది!
కేటీఆర్ రియాక్షన్ ఇదే!:
ఇలా తనపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేయడంపై కేటీఆర్ స్పందించారు. ఇందులో భాగంగా... ఫార్ములా - ఈ రేసు వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని.. అసలు ఆ వ్యవహారంలో అవినీతే జరగలేదని.. మరి అవినీతే లేనప్పుడు ఏసీబీ కేసు ఎక్కడుంది? అని అన్నారు. వీటిని రాజకీయ వేధింపులుగా అభివర్ణించారు.
ఇందులో భాగంగా... ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి, కుంభకోణాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నందుకే ఇదంతా అని అన్నారు. అయితే... తాము ఉద్యమకారులమని, ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని అంటూ... "నువ్వు మా వెంట్రుక కూడా పీకలేవ్" అని స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.