Begin typing your search above and press return to search.

ఓ సన్నాసిని తీసుకొచ్చి పెట్టిన్రు.. ఆ జిల్లా కలెక్టర్‌పై కేటీఆర్ తిట్ల పురాణం

ఆ కలెక్టర్‌తోపాటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు అధికారులు, పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   27 Nov 2024 4:33 AM GMT
ఓ సన్నాసిని తీసుకొచ్చి పెట్టిన్రు.. ఆ జిల్లా కలెక్టర్‌పై కేటీఆర్ తిట్ల పురాణం
X

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి అధికారుల మీద నోరు పారేసుకున్నారు. ఈసారి ఏకంగా ఓ ఐఏఎస్‌ను టార్గెట్ చేస్తూ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. బ్యూరోక్రాట్ అని కూడా వదలకుండా తిట్ల పురాణం అందుకున్నారు. ఆ కలెక్టర్‌తోపాటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు అధికారులు, పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు.

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కేటీఆర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులను కలెక్టర్ పార్టీ మారాలని చెబుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆయనో సన్నాసి అంటూ తిట్ల దండకం అందుకున్నారు.

‘ఓ కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ సీట్లో కూర్చున్నడు. గిసొంటి సన్నాసులను తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నరు. అయినా ఏం ఫరక్ పడది. బీఆర్ఎస్ వెంట్రుక కూడా పీకలేడు’ అంటూ కలెక్టర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన మన నాయకులను పార్టీ మారాలంటూ సీదా చెప్తుండంట. గంత గొప్పోడున్నడు ఇక్కడి కలెక్టర్. ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు, పోలీసులు, అధికారుల నాటకాలు ఆడుతారు. మనం కూడా చూద్దాం. నేను అంత మంచోన్నేం కాదు. ఎవరెవరైతే అతి చేస్తున్నరో, కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నరో వారికి వడ్డీతో సహా ఇస్త. రేవంత్ రెడ్డి కాదు, ఆయన తాత వచ్చినా, జేజమ్మ వచ్చినా సిరిసిల్లలో వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ మాట్లాడుకొచ్చారు.

ఇక ఇదే సమయంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌పైనా ఫైర్ అయ్యారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్‌లా ఉంటున్నారని విమర్శించారు. బీజేపీ నాయకత్వం రేవంత్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా ఉందని, ఆయన మీద ఈగ వాలనీయకుండా కంటికి రెప్పలాగా సంజయ్ కాపాడుకొస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి అభిమానుల సంఘం అధ్యక్షుడు ఎవరని అడిగితే బండి సంజయ్ అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఒక్కసారిగా అధికారులపై రెచ్చిపోవడంతో ఆయన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ముఖ్యంగా అధికార యంత్రాంగంలో మరింత కోపాన్ని రగిల్చాయి.