మూసీ వెనుక దాగున్న ముసుగు దొంగ: కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి సర్కారుపై విరుచుకుపడ్డారు.
By: Tupaki Desk | 5 Oct 2024 11:30 AM GMTబీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి సర్కారుపై విరుచుకుపడ్డారు. మూసీ వెనుక దాగున్న ముసుగు దొంగ ఎవరు? అంటూ ప్రారంభించి.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులకు రుణ మాఫీని ఎగ్గొట్టారని.. కానీ, ఇదే సమయంలో మూసీ నదితో మురికి రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
రైతులకు రుణ మాఫీ చేస్తామంటూ.. ఊదరగొట్టిన కాంగ్రెస్ నేతలు.. అన్నదాతలను మభ్య పెట్టారని అన్నారు. అధికారంలోకి వచ్చాక.. కనీసం దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు. (వాస్తవానికి రుణ మాఫీ ప్రక్రియ కొనసాగుతోంది) ``రైతు బంధు ఎగ్గొట్టి.. మూసీ పేదల ఉసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు?`` అంటూ.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ పరోక్ష విమర్శలు గుప్పించారు.
అవ్వ తాతలకు నెలకు నాలుగు వేల చొప్పున పింఛన్ ఇస్తామని గ్యారెంటీ ఇచ్చిన నయ వంచకుడు ఎవ రు? అని ప్రశ్నించారు. అదేవిధంగా మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రూ.2,500 సాయంగా ఇస్తామని చెప్పి తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని చెప్పార ని.. కానీ, ఇప్పుడు దగా చేశారని.. ఆ దగావీరుడు ఎవరు? అని కేటీఆర్ నిలదీశారు.
బతుకమ్మ భారమా?
తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ ఈ ముఖ్యమంత్రికి(రేవంత్) భారమైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆడబిడ్డల ముచ్చట కూడా తీర్చేందుకు మనసు రావడం లేదని అన్నారు. పండుగ పూట పల్లెలను పస్తు పండబెడుతున్నారని దుయ్యబట్టారు. ``పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో బతుకమ్మ ఆడుకోవాల్నా`` అని ప్రశ్నించారు. రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చిందని కేటీఆర్ నిలదీశారు.