Begin typing your search above and press return to search.

ఆరు గ్యారెంటీలు గోవిందా.. గోవిందా..

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..

By:  Tupaki Desk   |   19 March 2025 4:19 PM IST
ఆరు గ్యారెంటీలు గోవిందా.. గోవిందా..
X

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్‌లో ఏ ఒక్క రంగానికి కూడా సరైన కేటాయింపులు లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు ప్రధాన హామీలకు నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే, వాటిని ప్రభుత్వం పక్కన పెట్టేసినట్లే కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, భట్టి విక్రమార్క గంటన్నర పాటు బడ్జెట్ గురించి మాట్లాడినప్పటికీ, కేటాయింపుల విషయానికి వచ్చేసరికి శూన్యంగా తేలిందని విమర్శించారు.

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇక "గోవింద.. గోవిందా.." అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో ఆ ఆరు హామీల ప్రస్తావనే లేదని, వాటిని పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలకు స్వస్తి పలికిందని ఈ బడ్జెట్ ప్రతిపాదనలతో స్పష్టమవుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న మాటను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన మండిపడ్డారు.

మహిళలకు ప్రతి నెల రూ. 2,500 ఆర్థిక సహాయం అందించే పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కేటీఆర్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఈ సహాయం అందిస్తామని మహిళలకు వాగ్దానం చేసి, వారి ఓట్లు పొందిన కాంగ్రెస్ ఇప్పుడు వారికి నిరాశ కలిగించేలా ఒక్క పైసా కూడా కేటాయించలేదని ఆయన అన్నారు.

అలాగే, వృద్ధులకు ప్రతి నెల రూ. 4,000 పింఛన్ కోసం కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని కేటీఆర్ విమర్శించారు. 500 రోజులు గడిచినా ఇప్పటికీ రూ. 4,000 పింఛన్ అమలు కాలేదని, ఇక ఆ మొత్తం రాదనే విషయం వృద్ధులకు అర్థమైపోయిందని ఆయన అన్నారు.

మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచే విధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ బడ్జెట్‌ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఆయన అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విమర్శలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అయితే, కేటీఆర్ చేసిన ఈ ఘాటు విమర్శలు రాబోయే రోజుల్లో రాజకీయంగా మరింత వేడిని రాజేసే అవకాశం ఉంది.