కేటీఆర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఏసీబీ కీలక నిర్ణయం!
ఈ నెల 8న కేటీఆర్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్‌పై నేడు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ చేపట్టింది.
By: Tupaki Desk | 15 Jan 2025 8:39 AM GMTబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్‌కు పండుగ పూట సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌కు.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. సుప్రీంలో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది.
ఈ నెల 8న కేటీఆర్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్‌పై నేడు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా.. కేటీఆర్ పిటిషన్ వేసేముందే రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. నేటి వాదనల్లో భాగంగా.. ఇది కేవలం రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని కేటీఆర్ తరపు లాయర్ ధర్మాసనం ముందుంచారు.
దీనిపై జస్టిస్ బేలా ఎం త్రివేది స్పందిస్తూ.. అపోజిషన్ లీడర్లుగా ఉన్నప్పుడు కేసులను ఎదుర్కోవాలి కదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమంటూ క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ కేసు పూర్తిస్థాయిలో విచారణ జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో కేటీఆర్ ఈ కేసు విచారణను ఎప్పటిలాగే ఎదుర్కోనున్నారు. ఇప్పటికే ఓ మారు కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది. రేపు ఈడీ సైతం విచారించనుంది.
మరోవైపు.. ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్, బీఎల్ఎన్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో మరోసారి వీరిని విచారణకు పిలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురిని కూడా ఏసీబీ అధికారులు విచారించారు. మరోసారి పిలిచే అవకాశం ఉండడంతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. రెండోసారి విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది.