కేటీఆర్ vs భట్టి : తెలంగాణ అసెంబ్లీలో ‘కమీషన్ల’ లొల్లి
దీనిపై బీఆర్ఎస్ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.
By: Tupaki Desk | 26 March 2025 9:40 AMతెలంగాణ శాసనసభ బుధవారం వాడివేడిగా మారింది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారానికి దారితీశాయి. పనులు కావాలంటే కాంగ్రెస్ నాయకులు 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
సభలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, బీఆర్ఎస్ సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఇరు పార్టీల సభ్యుల ఆందోళనతో సభా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
కేటీఆర్ చేసిన ఆరోపణలను నిరూపించాలని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే సభలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైకు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కేటీఆర్ గౌరవంగా మాట్లాడతారని తాను ఊహించానని, కానీ ఆయన సభనే కాకుండా రాష్ట్రాన్నే తప్పుదోవ పట్టిస్తున్నారని భట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు.
మరోవైపు కేటీఆర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం భారాస సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ లాబీలోని ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద వారు నిరసన తెలిపారు. "20 శాతం, 30 శాతం ప్రభుత్వమంటూ" నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
మొత్తానికి తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఈ ఘటన సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మరింత అగాధాన్ని సృష్టించింది.