Begin typing your search above and press return to search.

ఏపీలో గెలిచేది ఎవరో చెప్పిన కేటీఆర్ ?

దీనిని బట్టి చూస్తే ఎవరి జనాలు వారికి ఉన్నారు. ఎవరి ఓట్లు వారి దగ్గర ఉన్నాయి.

By:  Tupaki Desk   |   13 April 2024 3:36 AM GMT
ఏపీలో గెలిచేది ఎవరో చెప్పిన కేటీఆర్ ?
X

ఏపీ ఎన్నికల్లో ఎవరు విజేత అంటే బొచ్చెడు సర్వేలు ఉన్నాయి యూట్యూబ్ లో. అవి ఏ పార్టీ పాట ఆ రోటి కాడ పాడుతూ తోపు గాళ్ళం తామే అని చెబుతూంటాయి. ఓటర్ల మదిలో ఏముందో ఈ రోజుకీ ఎవరికీ తెలియదు అన్నది అసలైన సర్వే. ఎందుకంటే ఏపీలో చూస్తే జగన్ కి జనాలు వస్తున్నారు. చంద్రబాబుకూ వస్తున్నారు. అక్కడా ఈలలు గోలలు ఇక్కడా అలాగే ఉంది.

దీనిని బట్టి చూస్తే ఎవరి జనాలు వారికి ఉన్నారు. ఎవరి ఓట్లు వారి దగ్గర ఉన్నాయి. మరి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండే న్యూట్రల్ జనాలు ఎపుడూ పెదవి విప్పరు. వారు విప్పితే ఏకంగా అది ఏవీఎంలలోనే. దాంతో సర్వేలు అన్నవి తీసి పక్కన పెట్టాలా లేక పట్టించుకోవాలా అన్నది ఎవరి ఇష్టం వారిది.

ఇక పొరుగు రాష్ట్రంలోనూ ఏపీ ఎన్నికల మీద ఆసక్తి ఉంది. తెలంగాణాలో అయితే ఏపీలో ఎవరు గెలుస్తారు అంటే ఎవరికి తోచిన తీరున వారు మాట్లాడుతారు. అధికార కాంగ్రెస్ కి ఏపీలో ఎవరు గెలవాలని ఉంది అంటే బయటకు చెప్పరు కానీ అక్కడ వైసీపీ ఓడితేనే వారికి రాజకీయ లాభం అని అంటారు.

అలాగే విపక్ష బీఆర్ఎస్ కి ఏపీలో ఎవరుండాలి అంటే జగన్ అన్నది అన్యాపదేశంగా అంతా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అసలు ఏపీలో ఎవరు గెలుస్తారు అని బీఆర్ఎస్ అతి ముఖ్య నేత కేటీఆర్ నే నేరుగా అడిగితే ఆయన ఏమి చెబుతారు అన్నది ఆసక్తి మాత్రమే కాదు సంచలనం కూదా.

ఇదే ప్రశ్నను టీవీ9 'క్రాస్ ఫైర్'లో హోస్ట్ కేటీయార్ మీద ప్రయోగించారు. ఏపీ రాజకీయాలలో ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు అని సూటిగానే అడిగారు. దానికి కేటీఆర్ ఇచ్చిన జవాబు మాత్రం అదుర్స్. ఏపీలో అందరూ నాకు కావాల్సిన వారే. జగన్ అన్నయ్య అవుతారు. పవన్ కూడా అన్నతో సమానం. లోకేష్ నాకు స్నేహితుడు. చంద్రబాబు అయితే పెద్ద వారు అంటూ అందరినీ వరసలు కలిపేసారు

అందువల్ల ఎవరు గెలిచినా ఆంధ్రా ప్రజలకు మేలు జరగాలన్నదే తన అభిమతం అంటూ చాలా డిప్లమాటిక్ గా జవాబు చెప్పారు. అంతే కాదు ఏపీ ప్రజలు చాలా తెలివైన వారు, మంచి తీర్పు ఇస్తారు అని ఒక ట్విస్ట్ ఇచ్చేశారు. ఇక మళ్ళీ మళ్లీ అడగకుండా ఏపీలో ఎవరు గెలుస్తారు అని చెప్పడానికి తనకు అక్కడ ఓటు లేదు ఓటరుని కాదు అని కూడా చెప్పారు.

మొత్తానికి ఇవన్నీ చూస్తూంటే కేటీఆర్ చాలా తెలివిగానే జవాబు చెప్పారనిపిస్తుంది. ఏపీలో ఎవరు వచ్చినా ఇపుడు బీఆర్ఎస్ కి ఏమీ కలసివచ్చేది లేదు. అందుకే ఎవరైతే ఏమిటి అన్నట్లుగానే మాట్లాడారు అని అంటున్నారు. ముందు తన సొంత రాష్ట్రంలో అన్నీ చక్కదిద్దుకుని తాము నిలబడాలన్న తాపత్రయంతో బీఆర్ఎస్ ఉంది.

అదే బీఆర్ ఎస్ ఈపాటికి అధికారంలో ఉండి ఉంటే కచ్చితంగా వైసీపీ వైపో మరో వైపో స్టాండ్ తీసుకునేది అని అంటున్నారు. బట్ ఇపుడు సీన్ మారింది. పొలిటికల్ గా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఇబ్బంది జరిగింది. అందుకే అంతా మనవాళ్ళే అన్నీ మా ఊళ్ళే అన్న పాటను అందుకున్నారు అని అంటున్నారు. సరే ఇవాళ ఇలా చెప్పారు. జూన్ 4న ఫలితాలు తరువాత అయినా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ తమ అంతరంగాన్ని ఎంతో కొంత ఆవిష్కరించకపోతారా అపుడు పట్టుకోలేకపోతామా అని మీడియా ఎదురు చూస్తూనే ఉంటుంది.