కేకే ఇంట్లో రచ్చ... టీవీ తెరదాకా!
తాజాగా కేటీఆర్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేకే విషయాన్ని ప్రస్తావించారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలు తనను బాధించాయని, బీఆర్ఎస్ పార్టీ తన కుటుంబంలో చిచ్చు పెట్టిందని
By: Tupaki Desk | 14 April 2024 4:35 AM GMTనవ్వే ఆడదాన్ని .. ఏడ్చే మగాడిని నమ్మొద్దని వెనకటికి పెద్దలు చెప్పారు. తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఉదంతం తాజాగా ఈ సామెతను గుర్తుకు తెస్తున్నది. లాబీయింగ్ ద్వారా కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ గా ఎదిగిన కేశవరావు 2014 తెలంగాణ ఏర్పాటు సమయంలో బీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నాడు. కేసీఆర్ ఆశీస్సులతో రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. పార్టీ సెక్రటరీ జనరల్ స్థానం ఇచ్చి కేసీఆర్ తన తరువాత తనంతటి వ్యక్తిగా పార్టీలో గౌరవం ఇచ్చాడు. పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా కేసీఆర్ పక్క సీటు కేశవరావుదే.
గత జీహెచ్ఎంసీ ఎన్నికలలో అమెరికా నుండి వచ్చిన కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మికి కార్పోరేటర్ టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకున్నది. ఆ వెంటనే మేయర్ పదవి కావాలని విజయలక్ష్మి పట్టుబట్టడంతో పార్టీలో ఉన్న సీనియర్లను, ఉద్యమకారులను కాదని కేశవరావు మీద గౌరవంతో మేయర్ సీటును కట్టబెట్టారు. కేశవరావు కుమారుడు విప్లవ్ కుమార్ కు కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయాక కేశవరావు అనూహ్యంగా తిరిగి కూతురుతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. బీఆర్ఎస్ పార్టీతో తన ప్రయాణం తీర్ధయాత్ర అని, చివరి రోజుల్లో తిరిగి సొంత ఇంటికి వచ్చానని కేశవరావు అన్నాడు.
అమెరికాలో ఉన్న కేశవరావు కుమారుడు విప్లవ్ స్పందిస్తూ తన సోదరి, తండ్రి పార్టీ మారడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ప్రకటించాడు. అదే విషయాన్ని ఇండియాకు వచ్చి మీడియా సమావేశంలోనూ వెల్లడించాడు. తాజాగా కేటీఆర్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేకే విషయాన్ని ప్రస్తావించారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలు తనను బాధించాయని, బీఆర్ఎస్ పార్టీ తన కుటుంబంలో చిచ్చు పెట్టిందని, ఉగాదికి తన కుమారుడు మెసేజ్ పెడుతూ ఇదే ఆఖరి ఉగాది. ఇక నీ కుమారుడు లేడు అని పెట్టాడని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేకే కన్నీరు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు ఆ పార్టీ కేకే కుటుంబానికి పలు పదవులు ఇచ్చి గౌరవించింది. పార్టీ ఓడిపోయిన వెంటనే పార్టీ మారిన కేకే తీరును రాజకీయ విశ్లేషకులు తప్పుపట్టారు. ఈ వయసులో ఇదేం నిర్ణయం అని ప్రశ్నించారు. కానీ కేకే బీఆర్ఎస్ పార్టీ తన కుటుంబంలో చిచ్చు పెట్టిందనడం గమనార్హం. రాజకీయాలలో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయి. కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు కేశవరావు కొత్తగా మూటగట్టుకునేది ఏమీ ఉండదు. ఆఖరు నిమిషంలో అధికార వ్యామోహంతో పార్టీని మోసం చేసి వెళ్లాడన్న అపవాదు తప్ప.