Begin typing your search above and press return to search.

కేటీయార్ నిజాలు ఒప్పుకుంటున్నారా ?

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను కేటీయార్ ఒక్కొక్కటే అంగీకరిస్తున్నారు. మొన్నేమో మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలో లోపాలున్నాయని అంగీకరించారు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 5:24 AM GMT
కేటీయార్ నిజాలు ఒప్పుకుంటున్నారా ?
X

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను కేటీయార్ ఒక్కొక్కటే అంగీకరిస్తున్నారు. మొన్నేమో మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలో లోపాలున్నాయని అంగీకరించారు. తాజాగా ధరణి పోర్టల్లో లోపాలు నిజమే అని ఒప్పుకున్నారు. అందులో చాలా చిక్కులు, చికాకులున్నమాట వాస్తవమే అని చెప్పారు. ఇన్నిరోజులు ప్రతిపక్షాలు మేడిగడ్డ బ్యారేజి లోపాలు, ధరణి పోర్టల్లో అవకతవకలను ఎంత ఎత్తిచూపినా కేసీయార్,కేటీయార్ అంగీకరించలేదు. ఇప్పటికీ కేసీయార్ అంగీకరించటంలేదు కానీ మరి ఎందుకనో కేటీయార్ మాత్రం తప్పులు జరిగాయని అంగీకరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే పెద్ద కుంభకోణమని కాంగ్రెస్ ఎప్పటినుండో నానా రచ్చచేస్తున్నది. కాళేశ్వరం నిర్మాణమే ప్రపంచ అద్భుతమని ఇంతకాలం కేసీయార్, కేటీయార్, హరీష్ రావులు ఎదురుదాడులు చేస్తున్నారు. అయితే ఆమధ్య వచ్చిన భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అద్భుతమే జనాలందరికీ తెలిసిపోయింది. పంపు హౌస్ లు ముణిగిపోయాయి. ఇంజన్లు చెడిపోయాయి. భారీ వర్షానికే పంప్ హౌస్ ముణిగిపోయి, ఇంజన్లు చెడిపోవటమే చాలా విచిత్రమనిపించింది. ఇదిలా ఉండగానే మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ కుంగిపోవటం ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగిలినట్లయ్యింది.

ఇక ధరణి పోర్టల్ అయితే మరో బ్రహ్మాండమని కేసీయార్, కేటీయార్ చెప్పుకుంటున్నారు. ఇందులో లోపాలపై రైతులు, భూ యజమానులు ఎంత గోలచేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకనే ధరణి స్ధానంలో భూ భారతి అనే వ్యవస్ధను తీసుకొస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో పదేపదే చెబుతున్నారు. వీళ్లపై కేసీయార్ బహిరంగసభల్లో విరుచుకుపడుతున్నారు. భూ సయస్యల పరిష్కారానికి ధరణికి మించింది మరోటి లేదని కేసీయార్ ఊదరగొడుతున్నారు.

సరిగ్గా ఈ సమయంలోనే ధరణిలో లోపాలున్నాయని కేటీయార్ అంగీకరించటమే ఆశ్చర్యంగా ఉంది. పోర్టల్ నిర్వహణలో చాలా చిక్కులు, చికాకులున్నమాట వాస్తవమే అని ఒప్పుకున్నారు. కేటీయార్ ఒప్పుకోలుతో రేవంత్ అండ్ కో చేస్తున్న ఆరోపణలు నిజమే అని అంగీకరించినట్లయ్యింది. మరి దీనిపై కేసీయార్ ఏమంటారో ? భూ యజమనాలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి ఎన్నికల తేది దగ్గర పడుతున్న కొద్ది ప్రభుత్వ లోపాలను కేటీయార్ అంగీకరిస్తుండటమే విచిత్రంగా ఉంది.