కేసీఆర్ అసెంబ్లీకొస్తే ఆ కథే వేరు... కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అవును... బీఆరెస్స్ పార్టీ ఆఫీసులో తాజాగా జరిగిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని కేటీఆర్, హరీశ్ రావు నిర్వహించారు
By: Tupaki Desk | 9 Jan 2024 12:10 PM GMTఅసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమినుంచి పాఠాలు నేర్చుకుంటూ.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పుంజుకుని, తిరిగి సత్తా చాటాలని బలంగా భావిస్తున్న బీఆరెస్స్ పార్టీ ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా తాజాగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం లోక్ సభ పరిధిలోని బీఅరెస్స్ ప్రథమ, ద్వితీయ శ్రేణి నేతలంతా పాల్గొన్నారు! ఈ సందర్భంగా కేసీఆర్ ని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.
అవును... బీఆరెస్స్ పార్టీ ఆఫీసులో తాజాగా జరిగిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని కేటీఆర్, హరీశ్ రావు నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గురించి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... సీఎం అనే రెండు అక్షరాల కన్నా.. కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అని అన్నారు. ఇదే సమయంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆ కథే వేరు అన్నట్లుగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఈ సందర్భంగా భవిష్యత్ లో వేసే ప్రతి అడుగు కేసీఆర్ దళంగా, ఐకమత్యంగా ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేటీఆర్... త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్స్ ను గెలిపించుకుందామని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం లోక్ సభ సీటు కచ్చితంగా గెలవాల్సిందే అని కేటీఆర్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రస్థావించిన కేటీఆర్... మనమంతా ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్లమే అని.. అసెంబ్లీ సమావేశాల్లో మన పోరాట పటిమ చూశారని.. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండని అన్నారు. ఈ క్రమంలోనే సీఎం అనే రెండు అక్షరాల కన్నా.. కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అని కేటీఆర్ తెలిపారు.
ఇక వచ్చే నెలలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపిన కేటీఆర్... పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీల వారీగా సమీక్షలు ఉంటాయని.. ఇదే క్రమంలో త్వరలో రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని.. ప్రతి రెండు మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తామని శ్రేణులకు స్పష్టం చేశారు.
కాగా ఇటీవల జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోనూ 6 స్థానాలైన ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వరావుపేట కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా.. మిగిలిన కొత్తగూడేం స్థానాన్ని సీపీఐ దక్కించుకున్న సంగతి తెలిసిందే.