దమ్ము, ధైర్యం ఉంటే.. : సీఎం రేవంత్‌కు కేటీఆర్ షాకింగ్ సవాల్..
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా తాను రంగంలోకి దిగుతానని.. సీఎం రేవంత్ తన పదవికి రాజీనామా చేసిన మల్కాజి గిరి నుంచి రంగంలోకి దిగితే.. ఎవరు గెలుస్తారో చూసుకుందా మని అన్నారు.
By: Tupaki Desk | 1 March 2024 4:19 AM GMTతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ భారీ షాకింగ్ సవాల్ చేశా రు. "సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా.. నేను కూడా రాజీనామా చేస్తాను.. మీరేంటో నేనేంటో చూసుకుందాం" అని వ్యాఖ్యానించారు. "దమ్ము, ధైర్యం ఉంటే.. " అని కూడా వ్యాఖ్యలు సంధించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా తాను రంగంలోకి దిగుతానని.. సీఎం రేవంత్ తన పదవికి రాజీనామా చేసిన మల్కాజి గిరి నుంచి రంగంలోకి దిగితే.. ఎవరు గెలుస్తారో చూసుకుందా మని అన్నారు.
ఏంటి వివాదం..
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని తాజాగా సీఎం రేవంత్ బీఆర్ఎస్ కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. "ధైర్యముంటే సీఎం, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఇద్దరం కలిసి మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేసి తేల్చుకుందాం" అని రేవంత్ కు సవాల్ రువ్వారు.
ఏ ఎన్నికలలో అయినా రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమ కారు ప్రస్తుతం సర్వీసింగ్‌కు మాత్రమే వెళ్లిందని.. త్వరలోనే వస్తుందని అన్నారు. రేవంత్ ముందు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డలకు రూ.2,500 సహా ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. "మాది మేనేజ్‌మెంట్ కోటా అయితే.. రాహుల్, ప్రియాంకా గాంధీది ఏం కోటా? రేవంత్‌ది పేమెంట్ కోటానా? అలా సీటు తెచ్చుకున్నందుకు రేవంత్.. ఢిల్లీకి పేమెంట్ చేయాలి. బ్యాగులు మోయాలి. ఇందుకోసం బిల్డర్లు, వ్యాపారులను బెదిరించాలి" అని సీఎంపై విమర్శలు గుప్పించడం గమనార్హం.
ఔను తప్పులు జరిగాయి..
తమ పాలనలో తప్పులు జరిగాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే.. ఇవి ముఖ్యమంత్రి, మంత్రులకు తెలిసి జరగలేదని.. క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకున్న నిర్ణయాలు కూడా దీనికి కారణమై ఉంటాయని అన్నారు. ఒకవేళ తప్పులు గుర్తిస్తే.. విచారించి చర్యలు తీసుకోవాలని అన్నారు.