ఇపుడు తప్పులు ఒప్పుకుంటున్నారా ?
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అనే సామెత కేటీయార్ కు బాగా వర్తిస్తుంది.
By: Tupaki Desk | 13 Jan 2024 7:59 AM GMTచేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అనే సామెత కేటీయార్ కు బాగా వర్తిస్తుంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీయార్ పార్లమెంటు నియోజకవర్గాల్లోని నేతలతో సమీక్షలు జరుపుతున్నారు. ఇప్పటికి ఏడు పార్లమెంటు నియోజవర్గాల సమీక్షలు జరిగాయి. ఈ సమీక్షల్లో మాట్లాడిన నేతల్లో మెజారిటి కేసీయార్, కేటీయార్, కవిత, హరీష్ రావుల వ్యవహారశైలినే తప్పుపట్టారు. కేసీయార్ పదేళ్ళ పాలనలో పెరిగిపోయిన అవినీతి, అరాచకాలను ప్రస్తావించారు. జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకతను గుర్తించటంలో పాలకులు ఫెయిలైనట్లు మండిపడ్డారు.
జనాల్లో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్న సిట్టింగులకే కేసీయార్ టికెట్లు ఇవ్వటంతోనే ఓటమి తప్పలేదని పదేపదే చెబుతున్నారు. దాంతో నేతల ఆరోపణలు, వ్యాఖ్యలను ఖండించటానికి కేటీయార్ కు అవకాశం దొరకలేదు. ఎందుకంటే ఏ నియోజకవర్గం సమీక్షలో చూసినా మెజారిటి నేతలు కేసీయార్, కేటీయార్ వైఖరినే తప్పుపడుతున్నారు. దాంతో చేసేదిలేక చివరకు కేటీయార్ కూడా వాళ్ళ ఆరోపణలను అంగకరిస్తున్నారు. పార్టీ ఓటమికి బాధ్యత తనదే అని ప్రకటించారు.
ద్వితీయ శ్రేణినేతలు, క్యాడర్ను పట్టించుకోలేదని అంగీకరించారు. దళితబంధు, రైతుబంధుపథకాలు సరిగా అమలు కాకపోవటంతోనే పెద్ద దెబ్బపడిందని ఒప్పుకున్నారు. రైతుబంధు పథకంలో చాలామంది భూస్వాములకు కూడా డబ్బులు వేయటంతో జనాల్లో వ్యతిరేకత వచ్చేసిందన్నారు. చేసిన అభివృద్ధి, సంక్షేమపథకాలే గెలిపిస్తాయని అనుకున్నాము కాని సిట్టింగులను మారిస్తే గెలుస్తామని ఆలోచించలేదన్నారు. దళితబంధు పథకం అందరికీ అందకపోవటం వల్లే మెజారిటి దళితులు ప్రభుత్వానికి వ్యతిరేకమైనట్లు అంగీకరించారు. కాళేశ్వరంలో లోపాలు, మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ల కుంగుబాటును ప్రస్తావిస్తు పెద్ద పెద్ద నిర్మాణాలు చేసినపుడు చిన్న లోపాలు సహజమే అని సమర్ధించుకునే ప్రయత్నంచేశారు.
మొత్తం మీద తమ తప్పుల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని కేటీయార్ అంగీకరించారు. జరిగిన తప్పులను రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రిపీట్ కాకుండా జగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే కేటీయార్ మరచిపోయిన విషయం ఏమిటంటే ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందని. ఇపుడు కూడా జనాలను మోసంచేసి కాంగ్రెస్ ఓట్లేయించుకుందని అంటున్నారే కానీ తమ పాలనపైన వ్యతిరేకతతోనే జనాలు కాంగ్రెస్ ను గెలిపించారని ఒప్పుకోవటంలేదు.