'కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.. చరిత్రలో నిలిచిపోతుంది!'
``కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.. చరిత్రలో నిలిచిపోతుంది!`` అని మాజీ మంత్రి, ఆయన కుమారుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 23 March 2024 12:30 PM GMT``కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.. చరిత్రలో నిలిచిపోతుంది!`` అని మాజీ మంత్రి, ఆయన కుమారుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదేదో కేజ్రీవాల్‌కు సపోర్టుగా కేసీఆర్ వ్యాఖ్యలు చేసినందుకు కాదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ తరఫున ఇద్దరు మాజీ అఖిల భారత సర్వీసుల అధికారులకు టికెట్లు ఇవ్వడమే. దీనిని ప్రస్తావిస్తూ.. కేటీఆర్ తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
"ఇద్దరు ఆల్ ఇండియా మాజీ ఆఫీసర్లు బీఆర్ఎస్ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఈ గొప్ప నిర్ణయం తీసుకున్న కేసీఆర్ గారికి అభినందనలు. నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రాం రెడ్డిలకు శుభాకాంక్షలు. ఈ ఇద్దరిని ప్రజలు గెలిపించి పార్లమెంట్‌కు పంపుతారనే నమ్మకం ఉంది" అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాగా, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు మాజీ అధికారులకు అవకాశం ఇచ్చారు. మెదక్ స్థానం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రాంరెడ్డి, అలాగే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం(ఎస్సీ) నుంచి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు అవకాశం ఇచ్చారు.
ఇలా ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్లకు బీఆర్ఎస్ లోక్‌సభ ఎంపీ టికెట్లు కేటాయించడం పట్ల ఆ పార్టీ మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాగా, మరో 4 పార్లమెంటు స్థానాలకు బీఆర్ ఎస్ తన అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. దీనిలో కీలకమైన నల్గొండ, భువనగిరి ఎంపీ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అయితే.. ఎంపీ అభ్యర్థులుగా మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లు రాష్ట్రంలో కొత్త కాకపోవడం గమనార్హం. గతంలో టీడీపీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరిద్దరు పోటీ చేసిన విషయం తెలిసిందే.