కేతిరెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలపై భారీ పంచ్ పడిందిగా?
ఢిల్లీలో తాజాగా మాట్లాడిన ఆయన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురి చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
By: Tupaki Desk | 11 July 2024 4:13 AM GMTఅవసరమైన వేళ అనవసరమైన విషయాల్ని ప్రస్తావించటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తరచూ మిస్ అవుతున్నారు. తానేం మాట్లాడాలన్న దానిపై ఆయన క్లారిటీ మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆయన అనవసర అంశాల్ని ప్రస్తావిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా అలాంటి పరిస్థితే మరోసారి ఎదురైనట్లుగా చెబుతున్నారు. ఢిల్లీలో తాజాగా మాట్లాడిన ఆయన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురి చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
సోషల్ మీడియాలో కేతిరెడ్డి ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఒకరు సోషల్ మీడియాలో చూపించిన విధంగానే వారి తీరు వాస్తవంలోనూ అలానే ఉంటుందనుకోవటానికి వీల్లేదు. ఈ విషయాలన్ని కేటీఆర్ లాంటి స్థాయి నేతలకు తెలియంది కాదు. నిజానికి ఎవరి గురించైనా మాట్లాడే వేళలో వారి గురించి వివరాలు పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడటానికి మించిన తప్పు మరొకటి ఉండదు.
మరేం జరిగిందో కానీ కేతిరెడ్డి గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. ధర్మవరంలో ప్రజల్లో తిరిగిన కేతిరెడ్డి ఓటమిపై కేటీఆర్ విస్మయం వ్యక్తం చేయటం ఇప్పుడు చర్చగా మారింది. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో చేపట్టిన కార్యక్రమం.. దాన్ని సోషల్ మీడియాలో ఆయన ప్రచారం చేసుకున్న తీరుతో కేతిరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు. యూట్యూబ్ వీడియోలను.. సోషల్ మీడియా.. వాట్సాప్ లను ఫాలో అయ్యే వారికి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఇమేజ్ సోషల్ మీడియాలో ఉండొచ్చు కానీ వాస్తవంలో ఉండకపోవచ్చు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేటీఆర్ కు విస్మయానికిగురైతే తన మనుషుల ద్వారా.. ఏపీలో తనకున్న ఎంతోమంది స్నేహితుల ద్వారా ఆరా తీసి ప్రస్తావిస్తే బాగుండేది.
కేతిరెడ్డి ఓటమి తనను విస్మయానికి గురి చేసిందని.. తన స్నేహితుల ద్వారా ఆరా తీసుకుంటే ఫలానా విషయం తెలిసిందన్న మాటలు కొంత వరకు ఓకే. అందుకు భిన్నంగా కేతిరెడ్డి ఓటమిపై కేటీఆర్ రియాక్షన్ ఇప్పుడు విమర్శలకు తెర తీసింది. ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సందులు.. గొందుల్లో తిరుగుతూ ప్రభుత్వ.. ప్రైవేటు ఆస్తుల్ని కాజేశారంటూ తీవ్ర ఆరోపణలు చేవారు.
ఇవేమీ కేటీఆర్ కు తెలిసినట్లు లేవన్న ఆయన.. "ఇవేమీ తెలుసుకోకుండా ధర్మవరంలో ప్రజల్లో తిరిగిన మా ఫ్రెండ్ కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయారోనని కేటీఆర్ మాట్లాడటం సరికాదు. తెలంగాణలో బీఆర్ఎస్ ను.. ఏపీలో వైసీపీను ప్రజలు మూకుమ్మడిగా ఓడిస్తే జగన్.. కేటీఆర్.. కేతిరెడ్డిలు ఒక చోటకు చేరి ఒకరికొకరు ఓదార్చుకుంటూ సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నారు" అంటూ సత్యకుమార్ చేసిన ఎద్దేవా అందరిని ఆకర్షిస్తోంది.