Begin typing your search above and press return to search.

కేటీఆర్‌.. అదంతా ఈజీయా?

గతేడాది డిసెంబర్‌ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ చిత్తయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 July 2024 11:12 AM GMT
కేటీఆర్‌.. అదంతా ఈజీయా?
X

గతేడాది డిసెంబర్‌ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ చిత్తయిన సంగతి తెలిసిందే. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. మరోవైపు పది మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు, దీంతో బీఆర్‌ఎస్‌ మరింత కష్టాల్లో కూరుకుపోయింది.

కాగా మరింత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది. బీఆర్‌ఎస్‌ గత ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకుంది. ఇందులో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. దీంతో బీఆర్‌ఎస్‌ బలం 38కి తగ్గిపోయింది. ఇందులో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో బీఆర్‌ఎస్‌ కు 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీరిలో మరో 16 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరితే బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం కాంగ్రెస్‌ పార్టీలో విలీనమైనట్టుగా స్పీకర్‌ గుర్తిస్తారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా బీఆర్‌ఎస్‌ అగ్ర నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ రావు చర్యలు చేపట్టారు. ఇప్పటికే హైకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు వస్తాయని.. ఎవరూ పార్టీ మారొద్దని.. మారి ఓడిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దని ఒక రకంగా కేసీఆర్, కేటీఆర్‌ బెదిరింపు స్వరంతో మాట్లాడుతున్నారని అంటున్నారు.

అయితే హైకోర్టులు శాసనసభ స్పీకర్‌ విధుల్లో జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఆ మేరకు రాజ్యాంగంలో స్పీకర్లకు ప్రత్యేక హక్కులు, అధికారాలు ఉన్నాయని చెబుతున్నారు. స్పీకర్‌ ను నిర్ణయం తీసుకోవాలని కోరే అవకాశం ఉంది తప్ప అనర్హత వేటు విధించాలని ఆదేశాలు జారీ చేసి అధికారం, నేరుగా స్పీకర్‌ కు ఆదేశాలు జారీ చేసే అధికారం కోర్టులకు ఉండవని అంటున్నారు.

ఈ విషయం బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి తెలిసినా తమ పార్టీ ఎమ్మెల్యేలను మభ్యపెడుతోందని చెబుతున్నారు. పార్టీ మారకుండా మిగిలినవారికి హెచ్చరికలు జారీ చేయడానికే ఇలా చేస్తోందని అంటున్నారు. ఎమ్మెల్యేలు మారినచోట ఉప ఎన్నికలు వస్తాయని చెప్పడం కూడా స్ట్రాటజీలో భాగమేనని పేర్కొంటున్నారు.

గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు పదుల సంఖ్యలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌ లో చేర్చుకున్నారు. అప్పుడు ఎమ్మెల్యేలపై పడని అనర్హత వేటు, ఆ నియోజకవర్గాల్లో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా సాధ్యమో బీఆర్‌ఎస్‌ నేతలే చెప్పాలని సెటైర్లు పడుతున్నాయి.

కాగా ఉప ఎన్నికలు వస్తాయని పార్టీ నేతలను మభ్యపెడుతూ ఇప్పటికే పార్టీ మారి వెళ్లిపోయిన పది ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కొత్త ఇంచార్జులను నియమించడంపై బీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఖైరతాబాద్, భద్రాచలం, స్టేషన్‌ ఘనపూర్, బాన్సువాడ, జగిత్యాల, గద్వాల, పటాన్‌ చెరు, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో ఇంచార్జులను నియమించే పనిలో బీఆర్‌ఎస్‌ ఉంది. వీటిలో ఇప్పటికే కొందరిని ఇంచార్జులుగా నియమించింది. మరికొన్ని చోట్ల ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు.