కేటీఆర్ బ్రేక్ డ్యాన్సుల వ్యాఖ్యలు... మహిళా కమిషన్ సీరియస్!
మైకుల ముందు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడకపోతే సమస్యలు తప్పవనే సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Aug 2024 4:20 AM GMTమైకుల ముందు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడకపోతే సమస్యలు తప్పవనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది.
అవును... మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. మహిళల పట్ల ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా మహిళా కమిషన్ అభిప్రాయపడింది! తెలంగాణ మహిళలను కించపరిచేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని కమిషన్ ఛైర్ పర్సన్ శారద నేరెళ్ల ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలపై విచారణ ప్రారంభించినట్లు తెలంగాణ మహిళా కమిషన్ వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు అనుచితంగా ఉండటమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు బాధ కలిగించాయని కమిషన్ అభిప్రాయపడింది.
కాగా... బస్సుల్లో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేమిటి అంటూ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బస్సులో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు తాము వద్దనట్లేదని చెప్పిన కేటీఆర్... అవే కాదు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు కూడా వెసుకోవచ్చు అని అన్నారు!
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు సీట్ల కోసం కొట్టుకుంటున్నారని.. డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పిన కేటీఆర్... బస్సులు ఎక్కువగా పెట్టండి, అవసరమైతే ఒక్కొక్కరికీ ఒక్కో బస్సు పెట్టండంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు!
కేటీఆర్ ఇలా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి సీతక్క. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చంటూ కేటీఆర్ జుగుప్సకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ తండ్రి ఆయనకు నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ప్రశ్నించారు. మహిళలు అంటే కేటీఆర్ కు గౌరవం లేదని అన్నారు.
కేటీఆర్.. తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు! ఈ నేపథ్యంలోనే కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది.