సీఎం ఎంపికపై అసెంబ్లీలో కేటీఆర్ సంచలన ఆరోపణలు
ఇందులో మరో అంశంపై కేటీఆర్ మాట్లాడుతూ తను ఎన్ఆర్ఐ మినిస్టర్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయనను తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారా? అంటూ ప్రశ్నించారు.
By: Tupaki Desk | 16 Dec 2023 9:11 AM GMTగవర్నర్ తమిళిసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై శనివారం అసెంబ్లీలో చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా పాలక పక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగింది. సభలో ప్రధాన ప్రతిపక్షం తరుఫున ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ ప్రధాన భూమిక పోషించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే విధానంపై నిలదీశారు. కాంగ్రెస్ గొప్పల కోసం 6 హామీలను ఇవ్వడంతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను సైతం 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిందని వీటి విధి విధానాలు ఎక్కడని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. పాలక పక్షం కూడా వీరి ప్రశ్నలపై స్పందించింది. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే మొదటి హామీని నెరవేర్చామని చెప్పింది.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుందని అందుకే ఇప్పటి వరకు మనుగడ సాధించగలిగిందని చెప్పగా.. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది టీఆర్ఎస్సే అనే అంశంపై హరీశ్ రావు మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులపై తాము ఆ సమయంలో పోరాటం చేస్తుంటే ఇప్పుడున్న నాయకులు ఎవరూ కలిసి రాలేదని, ఒక్క పీజేఆర్ మాత్రమే కలిసి వచ్చాడని గుర్తు చేశారు. అయితే ఎమ్మెల్యే కాకుండానే హరీశ్ రావుకు మంత్రి పదవి ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి కాదా అని రేవంత్ ఎదురు ప్రశ్నించారు.
ఇందులో మరో అంశంపై కేటీఆర్ మాట్లాడుతూ తను ఎన్ఆర్ఐ మినిస్టర్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయనను తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారా? అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ మాట్లాడుతూ ‘రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని, ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి’ అని ఎద్దేవా చేశారు. ‘తనను ఎన్నారై మినిస్టర్ అని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారని, ఎన్నారైని అధ్యక్షురాలిని చేసింది ఏ పార్టీనో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. దీనిపై రాజనర్సింహ స్పందిస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అని.. హైకమాండ్ ఆదేశాలు పాటిస్తామని చెప్పారు. ఇద్దరి మాటల యుద్ధంతో సభలో హీట్ పెరిగింది. ధన్యవాద తీర్మానంలో మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శన అస్త్రాలు సంధించారు.