Begin typing your search above and press return to search.

20మంది ఎమ్మెల్యేలతో కేటీఆర్ ఢిల్లీ టూర్..కవిత కోసమా? జంపింగ్ ఆపేందుకా?

ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనూహ్యంగా ఢిల్లీకి పయనం కానుండడం ఆసక్తి రేపుతోంది.

By:  Tupaki Desk   |   26 Aug 2024 9:49 AM GMT
20మంది ఎమ్మెల్యేలతో కేటీఆర్ ఢిల్లీ టూర్..కవిత కోసమా? జంపింగ్ ఆపేందుకా?
X

అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాయి.. ఆషాఢమూ అయిపోయింది.. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఖరారవుతోంది.. మంత్రివర్గ విస్తరణకూ ముహూర్తం వేళవుతోంది. నామినేటెడ్ పదవులూ భర్తీ కానున్నాయి.. ఇక మిగిలింది.. మధ్యలో ఆగిపోయిన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఆకర్షణ.. దీంతో బీఆర్ఎస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.. ఏ క్షణమైనా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ లాగేసుకునే ప్రమాదం ఉందని భయపడుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనూహ్యంగా ఢిల్లీకి పయనం కానుండడం ఆసక్తి రేపుతోంది.

రుణ మాఫీ రణం చేస్తూనే..

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీ హామీని నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ ఆందోళనలు, ఆరోపణలకు దిగుతోంది. మరోవైపు హైడ్రా కూల్చివేతలను ప్రశ్నిస్తోంది. పార్టీ నేతలను టార్గెట్ చేస్తుండడం పట్ల విమర్శలు గుప్పిస్తోంది. ఇంతటి బిజీ షెడ్యూల్ లో కేటీఆర్ భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఢిల్లీకి వెళ్తుండడం గమనార్హం. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలు గెలిచింది. వీరిలో లాస్యప్రియ మరణం అనంతరం జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. సాంకేతికంగా బీఆర్ఎస్ కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ.. వీరిలో 10 మంది కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. మిగిలిన 28 మందిలో 20 మందితో కేటీఆర్ ఢిల్లీ వెళ్లడం వెనుక ఉద్దేశం ఏమిటనేది చూడాలి. వీరేకాక ముఖ్య నేతలనూ వెంట తీసుకెళ్తున్నారు.

రేపు కవిత బెయిల్ పిటిషన్ విచారణ

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఐదు నెలలుగా తిహాడ్ జైలులో ఉన్నారు. బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు, రౌస్ అవెన్యూ కోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించారు. కానీ.. నిరాశే ఎదురైంది. అయితే, మంగళవారం సుప్రీం కోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌ పై విచారణ జరగనుంది. ఈ సందర్భంగా కూడా కేటీఆర్ పర్యటన ఆసక్తి రేపుతోంది. మంగళవారం కవితకు బెయిల్ కచ్చితంగా వస్తుందని బీఆర్ఎస్ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే ఆమెను ఆహ్వానించేందుకు భారీ బలగంగా 20 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. కాగా, తిహాడ్ జైల్లో నెలల తరబడి ఉన్న కవిత తరచూ అస్వస్థతకు గురవుతున్నట్లు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. రెండుసార్లు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని న్యాయవాదులు కోర్టుకు నివేదించారు.

జంపింగ్ లూ ఆగుతాయనా?

కేటీఆర్ ఢిల్లీకి ఎమ్మెల్యేలతో వెళ్లడం వెనుక మరో కోణం కూడా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వలలో పడకుండా.. 20 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని చూపేందుకే ఇలా చేస్తున్నారని పేర్కొంటున్నారు. హైదరాబాద్ నుంచి వీరిని తరలించడం ముఖ్యమనే ఆలోచన దీని వెనుక కనిపిస్తోందని చెబుతున్నారు. ఒకవేళ కవితకు బెయిల్ రాకుంటే కేటీఆర్ ఎమ్మెల్యేలతో ఢిల్లీలోనే మకాం వేస్తారని వివరిస్తున్నారు. అంతేకాదు.. ఢిల్లీ కేంద్రంగా కేటీఆర్ మరో ఆలోచనతో ఉన్నారని.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేదే ఆ ఆలోచని అని ఏకంగా పెద్దఎత్తున ఊహాగానాలకు తెరతీస్తున్నారు కొందరు. మరి కేటీఆర్ ఏం చేయబోతున్నారు..? అనేది తేలాల్సి ఉంది.