Begin typing your search above and press return to search.

ఆగస్ట్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ డెడ్ లైన్ !

గతేడాది తమ ప్రభుత్వం సకాలంలో నీటిని ఎత్తిపోసి ఎల్ఎండీ, మిడ్ మానేర్ సహా రంగనాయకమ్మ, మల్లన్న సాగర్ వరకు నీటిని తరలించిందని కేటీఆర్ గుర్తు చేశారు.

By:  Tupaki Desk   |   26 July 2024 4:30 PM GMT
ఆగస్ట్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ డెడ్ లైన్ !
X

ఆగస్ట్ 2వ తేదీ లోపు కాళేశ్వరం పంపులు ఆన్ చేసి నీటిని తోడి తరలించకపోవడంతో 50 వేల మంది రైతులతో కలిసి మేమే మోటార్లు ఆన్ చేస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కాళేశ్వరం సందర్శించిన ఆయన ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వం కేసీఆర్ ను బద్నాం చేసేందుకు మోటార్లను ప్రారంభించకుండా రైతుల పొలాలను ఎండబెడుతున్నారని ఆరోపించారు.

నీళ్లు వృథా పోతుంటే ఎత్తిపోయకుండా రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని, కేసీఆర్ మీద కక్షతో రైతుల నోట్లో మట్టికొట్టొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. రాజకీయాల కోసం రైతులను బలి పెట్టవద్దని, శ్రీరాం సాగర్, ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి లో నీరు లేని కారణంగా రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ వైపు గోదావరి ఎగువన నీటి కరువు ఉంటే మేడిగడ్డ వద్ద మాత్రం పదిలక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా కిందకు పోతున్నాయని, ఈ నీటిని సకాలంలో ఎత్తిపోసుకుంటే శ్రీరాంసాగర్, ఎల్ఎండీ, మిడ్ మానేర్, రంగనాయకమ్మ సాగర్, కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ జలాశయాలను నింపుకొని నీటి కొరత లేకుండా చేసుకోవచ్చని కేటీఆర్ అన్నారు.

ఇప్పుడు నీటిని ఎత్తిపోయకుంటే వానాకాలం పంట కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుందని, గతేడాది తమ ప్రభుత్వం సకాలంలో నీటిని ఎత్తిపోసి ఎల్ఎండీ, మిడ్ మానేర్ సహా రంగనాయకమ్మ, మల్లన్న సాగర్ వరకు నీటిని తరలించిందని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం రైతుల పంటలు ఎండిపోయిన సరే కేసీఆర్ కు పేరు రావద్దన్న దురుద్దేశంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకే రాజకీయాలు చేద్దామని...ఆ తర్వాత నాలుగున్నరేళ్లు ప్రజల కోసం పనిచేద్దామని, ఈ అంశాన్ని తాము రాజకీయం చేయాలనుకోవటం లేదని, రైతులకు మేలు చేయాలని మాత్రమే ప్రభుత్వాన్ని కోరుతున్నామని కేటీఆర్ అన్నారు.