Begin typing your search above and press return to search.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు గుండు సున్నా !

విభజన చట్టంలో ఉన్నవి గత పదేళ్లుగా అమలుకు నోచుకోలేనివి ఈసారి కూడా సాకారం కాలేదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 July 2024 11:05 AM GMT
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు గుండు సున్నా !
X

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో మొండి చేయి చూపించింది అని విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ పూర్తిగా తెలంగాణాను పక్కన పెట్టిందని అంటున్నారు. విభజన చట్టంలో ఉన్నవి గత పదేళ్లుగా అమలుకు నోచుకోలేనివి ఈసారి కూడా సాకారం కాలేదని అంటున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని వివక్షను చూపించారా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో తమను మెచ్చి ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారని ఎందుకు గుర్తించలేకపోయారు అని కూడా సెటైర్లు పడుతున్నాయి. దీని మీద బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణాను అతి పెద్ద గుండు సున్నాను కేంద్రం ఇచ్చిందని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ బీజేపీ కలసి తెలంగాణాను అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. 48.21 లక్షల కోట్ల బడ్జెట్ ని కేంద్రం ప్రవేశపెట్టిందని అందులో తెలంగాణా కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం పేరు చెప్పారు కానీ తెలంగాణ డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదని కేటీఆర్‌ అన్నారు. ఈ విభజన చట్టంలోని 35 హామీల మీద అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు.

ములుగు యూనివర్శిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీ పేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్న వాటి ఊసే కేంద్ర బడ్జెట్ లో లేదని ఆయన విమర్శించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా అని ఎన్ని సార్లు అడిగినా కూడా ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు. అలాగే ఐఐఎం సహా కేంద్ర సంస్థలను ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని అన్నారు.

తెలంగాణా నుంచి ముంబై నాగపూర్, బెంగళూర్ చెన్నై వంటి మార్గాలలో కారిడార్లకు నిధులు కోరామని అయినా కేటాయించలేదని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణా ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీ వెళ్ళి కేంద్రాన్ని కోరినా పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ బీజేపీ వంటి జాతీయ పార్టీలకు అధికారం ఇస్తే ఏమవుతుందో అందరూ అర్థం చేసుకోవాలని కేటీఆర్ ప్రజలకు కోరారు.

ఏపీలో బీహార్ లకు నిధులు దండీగా వచ్చాయని తెలంగాణాకు కూడా స్వీయ రాజకీయ ఆస్థిత్వం ముఖ్యమని కేటీఆర్ అన్నారు. ఏపీకి ఎక్కువ నిధులు ఇచ్చినందుకు తమకు ఎలాంటి బాధ లేదని కేటీఆర్ స్పష్టం చేయడం విశేషం. తమ సోదర రాష్ట్రానికి నిధులు ఇచ్చినా తప్పు లేదని కానీ అదే సమయంలో తెలంగాణాను నిర్లక్ష్యం చేయడమేంటి అని ఆయన ప్రశ్నించారు.

ఏపీకి అమరావతి రాజధాని పోలవరం వంటి వాటికి నిధులు ఇస్తామని చెప్పారని అలాగే పారిశ్రామిక కారిడార్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని అన్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చినా తెలంగాణాకు అసూయ లేదని కానీ కేంద్ర బడ్జెట్ లో మిగిలిన రాష్ట్రాలను కూడా సమానంగా చూడాలి కదా అని కేటీఆర్ ప్రశ్నించారు. మొత్తానికి చూస్తే కేంద్ర బడ్జెట్ మీద బీఆర్ ఎస్ అయితే మండిపోతోంది. పూర్తిగా అన్యాయం చేశారని కేంద్రాన్ని నిందిస్తోంది. దాని మీద బీజేపీ ఏ విధంగా జవాబు చెబుతుందో చూడాల్సిందే.