Begin typing your search above and press return to search.

ఎంపీ బరిలో కేటీఆర్.. బరిలోకి దిగేది ఎక్కడి నుంచి?

మాజీ మంత్రి కేటీఆర్ ను హైదరాబాద్ మహానగర పరిధిలోని సికింద్రాబాద్.. మల్కాజిగిరి నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   7 Jan 2024 4:20 AM GMT
ఎంపీ బరిలో కేటీఆర్.. బరిలోకి దిగేది ఎక్కడి నుంచి?
X

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో తన వ్యూహాలకు పదును పెడుతోంది బీఆర్ఎస్ పార్టీ. రానున్న మూడు నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అవకాశాలు అంతకంతకూ తక్కువగా ఉన్న నేపథ్యంలో గౌరవప్రదమైన స్థానాల్ని సొంతం చేసుకోవటానికి వీలుగా కొత్త ఎత్తుల్ని వేస్తోంది గులాబీ పార్టీ. అందులో భాగంగా పార్టీ ముఖ్యనేత.. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికైతే మాజీ మంత్రి కేటీఆర్ కు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని.. కానీ.. అంతిమంగా అధినేత నిర్ణయం తీసుకుంటే మాత్రం.. బరిలోకి రావటం ఖాయమని చెబుతున్నారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ పోటీ ఖాయమన్న అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చే సీట్లు రాష్ట్ర రాజకీయ వాతావరణంలో మార్పులు తీసుకురావటంలో కీలకభూమిక పోషిస్తుందని భావిస్తున్నారు. అందుకే.. ఈ ఎన్నికలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపటం ద్వారా గెలుపు అవకాశాల్ని మరింత మెరుగుపర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

మాజీ మంత్రి కేటీఆర్ ను హైదరాబాద్ మహానగర పరిధిలోని సికింద్రాబాద్.. మల్కాజిగిరి నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 ఎంపీ స్థానాలకు 9 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందగా.. బీజేపీ నాలుగు.. కాంగ్రెస్ మూడు.. మజ్లిస్ ఒక స్థానాన్ని సొంతం చేసుకుంది. దాదాపు నెల క్రితం ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందిన అసెంబ్లీ స్థానాల్ని పరిగణలోకి తీసుకుంటే.. 7 ఎంపీ సీట్లలో విజయం సాధించింది. మిగిలిన ఎంపీ స్థానాలతో పోలిస్తే.. సికింద్రాబాద్.. మల్కాజిరిగి ఎంపీ నియోజకవర్గాల్లో స్పష్టమైన అధిక్యతను గులాబీ పార్టీ ప్రదర్శించింది.

అందుకే.. ఈ స్థానాల్లో ఏదో ఒక దాని నుంచి కేటీఆర్ పోటీ చేస్తే.. సానుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో.. ఈ రెండు స్థానాల్లో ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాగా.. మరొకటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ ఉంది. ఇలాంటి వేళ.. ఈ రెండు స్థానాల్లో ఒకదాని నుంచి కేటీఆర్ ను పోటీ చేయించటం ద్వారా.. భారీ అస్త్రాన్ని గులాబీ పార్టీ ఎక్కు పెడుతుందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.