పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్.. మంత్రి పదవిపై హామీ?
అయితే, పొన్నాలకు ఏకంగా మంత్రి పదవిని ఆఫర్ చేసి ఉండొచ్చని మరికొందరు బీఆర్ ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 14 Oct 2023 3:45 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చేరికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన బీఆర్ ఎస్ కాంగ్రెస్ ను సాధ్యమైనంత వరకు బలహీన పరిచే వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అసంతృప్త నేత, బీసీ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీని వీడి బయటకు వచ్చిన మరుక్షణమే.. బీఆర్ ఎస్ రంగంలోకి దిగిపోయింది. పొన్నాల లక్ష్మయ్యను పార్టీలోకి చేర్చుకునే వ్యూహాన్ని అమల్లో పెట్టేసింది.
ఈ క్రమంలో పొన్నాల ఇంటికి హుటాహుటిన వెళ్లిన మంత్రి, బీఆర్ ఎస్ కీలక నాయకుడు కేటీఆర్.. ఆయనతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అదేవిధంగా ఐదు నిమిషాల పాటు ఏకాంతంగా రహస్య చర్చలు కూడా చేశారు. పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని.. పార్టీలో మంచి గుర్తింపు.. పొజిషన్ కూడా ఉంటుందని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం.
అయితే, పొన్నాలకు ఏకంగా మంత్రి పదవిని ఆఫర్ చేసి ఉండొచ్చని మరికొందరు బీఆర్ ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలిచి అధికారంలోకి వస్తే బీసీ నాయకుడిగా పొన్నాల లక్ష్మయ్యకు మంత్రి పీఠం ఖాయమని కేటీఆర్ వెంట పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్లిన ముఖ్య నేతల మధ్య కూడా చర్చసాగింది.
పార్టీలు మారిన నేతే.. అంటూ కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. పొన్నాల లక్ష్మయ్యను కలిసిన అనంతరం.. మీడియాతో మాట్లాడుతు.. పొన్నాలను పార్టీలోకి ఆహ్వానించామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీఎం చెప్పాకే తాను పొన్నాల ఇంటికి వచ్చానన్నారు. ఈనెల 16న జనగామలో జరిగే బహిరంగ సభలో పార్టీలో చేరే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్‌లో పొన్నాలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. పొన్నాలపై పీసీసీ చీఫ్ చేసిన కామెంట్స్ బాధాకరమని, పార్టీలు మారిన నేతే నీతులు చెబుతున్నాడని దుయ్యబట్టారు.
గుర్తింపు లేకనేనా?
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్న పొన్నాల వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రి గా పనిచేశారు. ఆ తర్వాత.. ఆయన హవా తగ్గుతూ వచ్చింది. ఇక, ఇటీవల కాలంలో మరింతగా పొన్నాలను పక్కన పెట్టేశారు.
తాజా ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కదనే ప్రచారం కూడా జరిగంది. మరో వైపు కాంగ్రెస్‌లో సీనియర్ల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం కూడా పొన్నాల బయటకు వచ్చేందుకు కారణమనే చర్చ సాగుతోంది. ఏదేమైనా కీలక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఒక బీసీ నేతను కోల్పోవడం అంతో ఇంతో ప్రభావం చూపించడం ఖాయమనే చర్చ సాగుతుండడం గమనార్హం.