Begin typing your search above and press return to search.

అమిత్ షా అపాయింట్మెంటూ...కేటీయార్ మెత్తని మనసూ ...!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉంది.బాబు చుట్టూ పోలీసుల పహరా ఉంది. ఆయనకు ప్రాణహాని అంటూ టీడీపీ అంటూంటే అయ్యో అంటున్నారు కేటీయార్.

By:  Tupaki Desk   |   13 Oct 2023 3:15 PM GMT
అమిత్ షా అపాయింట్మెంటూ...కేటీయార్ మెత్తని మనసూ ...!
X

రాజకీయాల్లో కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రతీదీ జరుగుతూ ఉంటాయి. ఇపుడు అలా రాజకీయాలలో నిండు జీవితాన్ని గడిపేసిన చంద్రబాబు తానే ముడి సరుకు అయిపోయారా అనిపించక మానదు. సాధారణంగా ఇలాంటి విషయాలలో సింపతీ ఏదైనా ఉంటే సొమ్ము చేసుకోవడానికి చంద్రబాబు ఎపుడూ సిద్ధంగా ఉంటారు. కానీ విధి విచిత్రం ఆయనే సింపతీ కార్డుగా మారిపోయారా అన్నదే కీలకమైన ప్రశ్నగా ముందుకు వస్తోంది.

లేకపోతే బీజేపీ పెద్దలు అటూ బీయారెస్ పెద్దలు ఇటూ బాబు ఏకైక కుమారుడి మీద అభిమానంతో కన్నీరు కార్చడమేంటి అన్నది కూడా డౌటానుమానంగా ఉంది. లోకేష్ అంటే కేరాఫ్ చంద్రబాబు. చంద్రబాబుకే బీజేపీ పెద్దలు ఎపుడూ అపాయింట్మెంట్ ఈ నాలుగున్నరేళ్ళ కాలంలో ఇచ్చి ఎరగరు. ఇక ఈ ఏడాది మధ్యలో ఒక రాత్రి చంద్రబాబు బీజేపీ బిగ్ షాట్ అమిత్ షాతో భేటీ అయ్యారు.

ఆ తరువాత ఏమి జరిగింది అన్నది ఎవరికీ తెలియదు మళ్లీ షరా మామూలే అన్నట్లుగా కధ సాగింది. ఎన్డీయే మీట్ కి బాబుకు పిలుపే లేదు. ఇదిలా ఉండగా బాబు అరెస్ట్ అయి జైలు గోడల మధ్య ప్రస్తుతం ఉన్నారు. బాబు అరెస్ట్ అయిన నాలుగవ రోజునే నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ఆయన కేంద్ర పెద్దలను కలవడానికే అని అంతా అనుకున్నారు. ప్రచారమూ అలాగే జరిగింది.

తీరా ఇరవై రోజులకు పైగా చినబాబు ఢిల్లీలో ఉన్నా బీజేపీ పెద్దలు ఇటు ముఖం అటు తిప్పలేదు అన్న విమర్శలూ వచ్చాయి. ఇంతలో ఉన్నట్లుండి అమిత్ స్థా తో లోకేష్ భేటీ ప్రపంచ ఎనిమిదో వింత అన్నట్లుగానే జరిగింది. పెద్దమ్మ పురంధేశ్వరి పక్కన ఉన్నారు. కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ ఇద్దరూ ఈ ఇరవై రోజులలో ఎపుడూ బీజేపీ పెద్దలకు చెప్పి ఈ భేటీ వేయించలేకపోయారా అన్నది కూడా పెద్ద ప్రశ్నగా ఉంది.

ఏది ఏమైనా లోకేష్ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ వల్ల బాబుకు టీడీపీకి ఏమి జరుగుతుంది అన్నది తెలియదు. కానీ బీజేపీ మాత్రం టీడీపీ పెద్ద చంద్రబాబు జైలు జీవితం పట్ల తాము సానుభూతిని వ్యక్తం చేస్తున్నామని చెప్పినట్లు అయింది అంటున్నారు. ఇదంతా ఎందుకు అంటే తెలంగాణా ఎన్నికల కోసం అని అంటున్నారు. ఒక బలమైన సామాజికవర్గం ఓట్లను తమ వైపు ఎంతో కొంత తిప్పుకోవడానికి బీజేపీ పెద్దలు లోకేష్ ని పిలిపించుకున్నారు మాట్లాడారూ అన్న టాక్ అయితే ఉంది.

సీన్ కట్ చేస్తే కేటీయార్ ఇపుడు తన మెత్తని హృదయాన్ని లోకేష్ ట్వీట్ ని చూసి పరచారు. తండ్రికి ఇబ్బంది అయితే కొడుకు పడే బాధ ఏంటో తనకు తెలుసు అంటూ సహ అనుభూతిని పొందారు. లోకేష్ తన తండ్రి చంద్రబాబు ప్రాణానికి ముప్పు ఉందని చేసిన ట్వీట్ కి రీ ట్వీట్ చేస్తూ కేటీయార్ అలా అయితే దురదృష్టకరం అని కామెంట్ చేశారు. బాబు జైలులో ఉన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉంది.బాబు చుట్టూ పోలీసుల పహరా ఉంది. ఆయనకు ప్రాణహాని అంటూ టీడీపీ అంటూంటే అయ్యో అంటున్నారు కేటీయార్.

తనది మెత్తని జాలి గుండె అని ఆయన సడెన్ గా నిరూపించుకుంటున్నారు. మరి ఇదే జాలి గుండె ఇప్పటికి ఇరవై రోజుల క్రితం ఈటీ ఉద్యోగులు హైదరాబాద్ లో ఆందోళన చేసినపుడు వారిని చెదరగొట్టినపుడు దాని మీద కేటీయార్ పరుష పదజాలంతో విరుచుకుపడినపుడూ లేదా అంటే ఆనాటి పరిస్థితులు వేరు. ఇపుడు సీన్ వేరు అన్నట్లుగానే ఉంది మరి.

బాబు సామాజికవర్గం ఓట్లను ఆకట్టుకునేందుకే ఇదంతా అని అంతా అంటున్న నేపధ్యం ఉంది. నిజానికి రెండు ఎన్నికలుగా బీయారెస్ కి ఆ సామాజికవర్గం వారు మద్దతుగా ఉన్నారు. ఈసారి వారు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారు అని వినిపిస్తోంది. దాంతో మొదట కటువుగా మాట్లాడిన కేటీయార్ ఇపుడు అయ్యో లోకేష్ అని అంటున్నారు అని కామెంట్స్ వచ్చి పడుతున్నాయి.

ఇక బీజేపీ పెద్దతో లోకేష్ భేటీ వెనక కూడా ఇదే రాజకీయ లాభం లెక్కలు ఉన్నాయా అని ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు లాంటి రాజకీయ వ్యూహకర్త ఇపుడు సానుభూతి ఓటు గా మారడం ఒక విషాదం అయితే దాని కోసం ఎత్తులు పై ఎత్తులు వేసుకోవడం మరో ట్రాజడీ. ఇంతకీ జనాలకు ఏమీ తెలియవా అంటే జవాబు వారు నోటితో చెప్పరు కదా ఈవీఎం లతో పలికిస్తారు.