Begin typing your search above and press return to search.

కరోనా కన్సెషన్ జనాలు ఇస్తారా... కేటీయార్ మాటల వెనక...?

తాము తొమ్మిదిన్నరేళ్ల పాటు పాలించలేదు అని మంత్రి కేటీయార్ చెబుతున్నారు. లెక్కలు చూస్తే పక్కాగా బీయారెస్ రెండు దఫాలుగా తొమ్మిదిన్నరేళ్ల పాటు పాలించినట్లుగా ఉంది.

By:  Tupaki Desk   |   24 Nov 2023 1:38 PM GMT
కరోనా కన్సెషన్ జనాలు ఇస్తారా... కేటీయార్ మాటల వెనక...?
X

కరోనా కన్సెషన్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. కానీ రాజకీయ నాయకులు జనాలకు వివిధ పధకాలను ఇచితంగా ఇస్తామని చెబుతూ హామీలు ఇస్తారు. రాయితీలు ఇస్తారు. మరి వారికి కూడా ఓట్లేసే ప్రజల నుంచి రాయితీ కావాలి కదా. ఇపుడు అదే తెలంగాణా ఎన్నికల వేళ అధికార బీయారెస్ అడుగుతోంది.

తాము తొమ్మిదిన్నరేళ్ల పాటు పాలించలేదు అని మంత్రి కేటీయార్ చెబుతున్నారు. లెక్కలు చూస్తే పక్కాగా బీయారెస్ రెండు దఫాలుగా తొమ్మిదిన్నరేళ్ల పాటు పాలించినట్లుగా ఉంది. కానీ ఇందులో మూడేళ్ళు తీసివేయాలన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. కరోనా కాలం తీసేస్తే మేము పాలించింది అచ్చంగా ఆరున్నరేళ్ళు మాత్రమే అని కేటీయార్ అంటున్నారు.

ఈ తక్కువ టైంలోనే తెలంగాణాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలంగాణాను అభివృద్ధి పధంలో నడిపామని కేటీయార్ చెప్పారు. ఆయన చెప్పినది నిజమే కావచ్చు. మధ్యలో కరోనా కాలం మూడేళ్ళ పాటు తీసివేయమని అంటున్నారు. మరి జనాలు దాన్ని పరిగణనంలోకి తీసుకుంటారా అన్నది చర్చగా ఉంది.

ఎందుకంటే అయిదేళ్లలో మూడేళ్ళ పాటు ప్రపంచం అంతా కరోనా వల్ల ఇబ్బంది పడింది ఒక్క తెలంగాణా కాదు ఏపీతో సహా దేశమంతా కూడా అలాగే ఉంది. అయితే ప్రజలు ఇవ్వన్నీ పట్టించుకుంటారా అన్నదే పాయింట్. ఏపీలో చూసుకున్నా వైసీపీ నేతలు తరచూ ఒక మాట అంటూంటారు.

కరోనా మూడేళ్ల కాలంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పధకాన్ని ఆపకుండా తాము పాలించామని. కరోనా సమయంలో విపక్ష నాయకులు ఎవరూ ఏపీకి రాకుండా హైదరాబాద్ లో ఉన్నారని. మరి ఏపీలో వైసీపీ కూడా కరోనా టైం లో తాము ప్రజలకు చేసిన సేవను, సంక్షేమ పధకాలను చెప్పుకుని ఓట్లు అడగడానికి సిద్ధంగా ఉంది

అదే టైం లో అభివృద్ధి జరగలేదు అంటే విలువైన మూడేళ్ల కరోనా కాలం పోయింది అని కూడా ఆ పార్టీ చెబుతూ వస్తోంది. మరి ఇవన్నీ కూడా ఓటేసే ముందు జనాల బుర్రల్లో ఆలోచనలుగా ఉంటాయా అన్నదే కీలక ప్రశ్న. ఒక్కసారి ప్రజలు ఒక రాజకీయ పార్టీకి అధికారం అప్పగించాక ఎలాంటి రాయితీలు మినహాయింపులు ఇవ్వరని చరిత్రలో పదిలంగా ఉన్న కొన్ని తీర్పులు చెబున్నాయి.

ఆరు నూరు కానీ ప్రపంచం ఒక్కటి కానీ తమకు కావాల్సింది ఇవ్వకపోతే కఠినంగానే తీర్పు ఇచ్చే నేర్పు ప్రజలకు ఉంటుంది. నిధులు లేవనో లేక కేంద్రం సహకరించలేదనో. లేక అప్పుల పాలు రాష్ట్రం అయింది అనో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ ప్రజలకు చెబుతూ ఉంటాయి.

అందులో నిజాలు కూడా ఉంటాయి. డబ్బులు లేకపోతే ఎవరు మాత్రం ఏమి చేయగలరు, కానీ ప్రజలు అయితే వాటిని ఏ మాత్రం పట్టించుకోరనే గత ఎన్నికల తీర్పు కచ్చితంగా చెబుతున్నాయి. ఒక్కసారి అధికారం అందుకున్నాక తాము చెప్పిన తీరున పాలించాల్సిందే. అంతే కాదు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా చూడాల్సిందే. ఈ విషయంలో తేడా వస్తే మాత్రం జనం తీర్పు వేరేగా ఉంటుంది.

ఆ మాటకు వస్తే కేంద్రంలో బీజేపీ కూడా మూడేళ్ల పాటు కరోనా వల్ల ఇబ్బందులు పడింది. రేపటి ఎన్నికల్లో బీజేపీ పెద్దలు కూడా ఇదే మాట జనాలకు చెప్పినా కూడా ప్రజా తీర్పులో తేడా ఉండాక్పోవచ్చు అంటున్నారు. మొత్తానికి కరోనా మూడేళ్ల కాలాన్ని మినహాయించాలని అసలు పాలన మొత్తం స్తంభించిన తీరుగా చూడాలన్నది అధికార పార్టీలు కోరడంలో సహేతుకత ఉంది. కానీ అలా జనాలు చూసే సీన్ మాత్రం ఉండదనే రాజకీయ నిపుణులు అంటున్నారు.