Begin typing your search above and press return to search.

నాకు ఫాంహౌజ్ లేదు.. పొంగులేటి ఫాంహౌజ్ అక్రమం..కేటీఆర్ గట్టి ఆరోపణ

ఇది మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు చెందినది అని ఆరోపిస్తుంటారు.

By:  Tupaki Desk   |   21 Aug 2024 10:12 AM GMT
నాకు ఫాంహౌజ్ లేదు.. పొంగులేటి ఫాంహౌజ్ అక్రమం..కేటీఆర్ గట్టి ఆరోపణ
X

తెలంగాణలో ఇప్పుడు చర్చనీయాంశం హైడ్రా.. ముఖ్యంగా హైదరాబాద్ లో హైడ్రా హడలెత్తిస్తోంది.. చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. దీంతో ప్రముఖుల భవనాలు నేలమట్టం అవుతున్నాయి. ఇటీవల ఆదివారం చేపట్టిన కూల్చివేతల్లో కేంద్ర మాజీ మంత్రికి చెందిన ఫాం హౌజ్ కూడా ఉండడం గమనార్హం. అయితే, హైడ్రా తదుపరి లక్ష్యం.. జొన్వాడలో ఉన్న ఫాంహౌజ్ అని ప్రచారం జరుగుతోంది. ఇది మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు చెందినది అని ఆరోపిస్తుంటారు.

అప్పట్లో డ్రోన్ ఎగురేసిన రేవంత్

మూడేళ్ల కిందట పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఈ ఫాంహౌస్ వద్దకు వెళ్లి డ్రోన్ ఎగురవేశారు. దీనిపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఇంతకూ జొన్వాడ ఫాంహౌస్ జీవో 111 పరిధిలో ఉందని.. జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్ పరిరక్షణకు ఉద్దేశించినదే ఈ జీవో. దీని ప్రకారం జంట జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. ఇలా చేపట్టిన వాటినే ఇప్పుడు హైడ్రా కూల్చివేస్తోంది. ఆ జాబితాలో జొన్వాడ ఫాంహౌస్ కూడా ఉందని చెబుతున్నారు. ఇది కేటీఆర్ దేనని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.

నాకేం ఇబ్బంది లేదు..

అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగితే తనకేమీ ఇబ్బంది లేదని కేటీఆర్ పేర్కొన్నారు. తనకసలు ఫాంహౌజ్ లేదని స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా అది కాంగ్రెస్ వారయినా, బీఆర్ఎస్ వారయినా చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. అయితే, జొన్వాడ ఫాం హౌస్ గురించి మాటాడుతూ.. అది తన ఫ్రెండ్ దని, తాను లీజుకు తీసుకున్నాని చెప్పారు. అందులో తప్పు ఉండి కూల్చివేస్తే అభ్యంతరం లేదని చెప్పారు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ లో ఉంటే తానే కూల్చివేయిస్తానని కూడా వ్యాఖ్యానించారు. మంచి జరుగుతుంటే ఆహ్వానించాలని సూచించారు.

మరి మంత్రి పొంగులేటి మాటేమిటి..

తనకు ఎలాంటి ఫాంహౌజ్ లేదన్న కేటీఆర్.. పలువురు కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్‌ నాయలకు ఫాంహౌజ్ ల ప్రస్తావన తెచ్చారు. వాటిని చూపిస్తానని కూల్చివేస్తారా? అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచందర్ రావు, పట్నం మహేందర్‌ రెడ్డి, శాసన మండలి చైర్మన్ సుఖేందర్‌ రెడ్డికి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఫాంహౌస్ లు ఉన్నాయని తెలిపారు. పొంగులేటి ఫాంహౌజ్ జీవో111 పరిధిలో ఉందని ఆరోపించారు. దానితోనే కూల్చివేతలు మొదలుపెట్టండి అని డిమాండ్ చేశారు.