Begin typing your search above and press return to search.

నీ రాఖీ లేకున్నా.. నీ కష్ట సుఖాల్లో నేనుంటా.. కేటీఆర్ భావోద్వేగ పోస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి ఐదు నెలలకు పైగా హైదరాబాద్ కు దూరమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

By:  Tupaki Desk   |   19 Aug 2024 6:52 AM GMT
నీ రాఖీ లేకున్నా.. నీ కష్ట సుఖాల్లో నేనుంటా.. కేటీఆర్ భావోద్వేగ పోస్ట్
X

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి ఐదు నెలలకు పైగా హైదరాబాద్ కు దూరమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఉద్యోగం చేస్తున్న అమెరికా నుంచి తిరిగివచ్చాక ఏనాడూ ఆమె బీఆర్ఎస్ పార్టీకీ, తెలంగాణకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నది లేదని చెప్పవచ్చు. కానీ, ఢిల్లీ లిక్కర్ విధానం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ అనూహ్యంగా సొంత కుంటుబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎంతగానో ఇష్టపడే ఒక్కగానొక్క కుమార్తె జైలు పాలవడం కేసీఆర్ నూ తీవ్రంగా వేదనకు గురిచేస్తోందని చెబుతున్నారు.

రేపు బెయిల్ వస్తుందా?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరపనుంది. తిహాడ్‌ జైల్లో ఉన్న కవిత.. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. జూలై 1న న్యాయస్థానం బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నెల 12న పిటిషన్‌ పై విచారణ చేపట్టిన సుప్రీం.. సీబీఐ, ఈడీ స్పందనలు తెలియజేయాలని కోరింది. తదుపరి విచారణను మంగళవారం చేపట్టనుంది.

నిరుడుకు నేటికీ ఎంత తేడా?

సరిగ్గా ఏడాది కిందట రాఖీ పండుగ సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. చుట్టూ నాయకులు, కార్యకర్తలు. కవిత ఎక్కడకు వెళ్లినా ప్రత్యేకత. ఇక ఆమె సోదరుడు కేటీఆర్ తెలంగాణలో కీలక శాఖల మంత్రిగా ఉన్నారు. దీంతో కేటీఆర్ కు కవిత రాఖీ కట్టడం అనేది మీడియాకు వార్త అయింది. ఇప్పుడు ఆమె తిహాడ్ జైల్లో ఉన్నారు. దీనిని చూసినవారు ఏడాదిలో ఎంత తేడా? అని ఆశ్చర్యపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ తన సోదరిని తలచుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు.

‘‘నువ్వు ఇవాళ రాఖీ కట్టకపోయినా నీ కష్టసుఖాల్లో నేను తోడుగా ఉంటాను..’’ అంటూ ట్వీట్ లో కేటీఆర్ పేర్కొన్నారు. దీనికి గతంలో కవిత రాఖీ కట్టినప్పటి, ఆమెను ఈడీ అరెస్టు చేస్తున్న సమయంలోని ఫొటోలను జత చేశారు. లిక్కర్ స్కాంలో ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న కవిత కొంతకాలంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కవిత 11 కిలోల బరువు తగ్గినట్లు కేటీఆర్ ఇటీవల చెప్పారు. కాగా, మంగళవారం కవితకు బెయిల్ రావాలని బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా కోరుకుంటున్నాయి.