పొన్నాలపై ప్రేమ పొంగుకొచ్చిన లెక్కలే వేరా?
ఎక్కడలేనంత అభిమానం.. ఎప్పుడే లేనంగా ప్రేమాభిమానాలు ఒక్కసారిగా పుట్టుకు రావటం సాధ్యం కాదు.
By: Tupaki Desk | 15 Oct 2023 5:16 AM GMTఎక్కడలేనంత అభిమానం.. ఎప్పుడే లేనంగా ప్రేమాభిమానాలు ఒక్కసారిగా పుట్టుకు రావటం సాధ్యం కాదు. ప్రతి పరిణామానికి ఒక లెక్క ఉంటుంది. తాజాగా టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై గులాబీ బాస్ కేసీఆర్ కు ప్రేమ పొంగుకు రావటం.. ఉన్నట్లుండి తన కొడుకు కేటీఆర్ ను పొన్నాల ఇంటికి పంపి మరీ.. పార్టీలోకి ఆహ్వానించటం లాంటివి చూసినప్పుడు పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీ కనిపించదు.
అవసరం అనుకుంటే ఎలాంటి ఈగోలకు పోకుండా కలుపుకుపోవటం.. వదిలించుకోవాలంటే ఎంతటోడినైనా వదిలించుకునే లెక్కలు కేసీఆర్ కు వచ్చినంత బాగా మరెవరికీ రాదనే చెప్పాలి. ఉద్యమ వేళలో కేసీఆర్ కు కుడిభుజంగా నిలిచిన ఈటెల రాజేందర్ తర్వాతి రోజుల్లో ఏమయ్యారో తెలిసిందే. అదే సమయంలో 2014 ఎన్నికల తర్వాత తుమ్మల కావొచ్చు మండవ కావొచ్చు అవసరానికి అనుగుణంగా తనకు అవసరమైన వారిని గులాబీ కారు ఎక్కించేసిన కేసీఆర్.. ఆ తర్వాత కాడిని ఎలా పడేస్తారో తెలియంది కాదు.
వైసీపీ తెలంగాణ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించే పొంగులేటిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేశారో.. ఆ మధ్యన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పటం తెలిసిందే. అవసరం అనుకోవాలే కానీ.. ఎవరినైనా ఒప్పించి వారిని తమ కారులో ఎక్కేలా చేసుకునే సత్తా ఉన్న కేసీఆర్ కు తగ్గట్లే కేటీఆర్ తీరు ఉంటుందని చెబుతున్నారు. ఈ మధ్యన విదేశీ పర్యటన సందర్భంగా పొన్నాల కుమారుడ్ని కలిసిన కేటీఆర్.. వారిద్దరి మధ్య చర్చలు కొన్ని నెలల క్రితమే చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
నిజానికి పొన్నాలకు కాంగ్రెస్ పార్టీ ఏం ఇచ్చింది అనే బదులు.. ఆయనేం చేశారన్నది ప్రశ్న. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని కట్టబెట్టటాన్ని మర్చిపోలేం. ఆయన హయాంలో పార్టీలో ఏం జరిగింది? ఏ స్థాయికి వెళ్లిందన్న విషయం తెలియనిదా? ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఆయన.. తనకున్న అనుభవంతో కేసీఆర్ సర్కారు చేపట్టిన ప్రాజెక్టుల మీద బలమైన పోరాటాన్ని చేశారా? అన్న ప్రశ్నలు. పార్టీ మారే వేళ.. అందరూ వ్యవహరించేలా పొన్నాల వ్యవహరిస్తున్నారని చెప్పాలి. కాకుంటే.. సమయానికి తగ్గట్లు స్పందించే కేసీఆర్ అవసరానికి తాజాగా పొన్నాల సరైన అవసరంగా చెప్పాలి. భవిష్యత్తు అంత బాగా లేనప్పుడు వచ్చిన బంఫర్ ఆఫర్ ను పొన్నాల సైతం ఎందుకు వదులుకుంటారు చెప్పండి?