Begin typing your search above and press return to search.

ఇదేంది కేటీఆర్.. ఇంత అడ్డంగా బుక్ చేశారు?

నిత్యం సుద్దులు చెప్పే మంత్రి కేటీఆర్.. ప్రవళిక విషయంలో తొందరపాటును ప్రదర్శించారన్న వాదన బలంగామారింది.

By:  Tupaki Desk   |   17 Oct 2023 4:57 AM GMT
ఇదేంది కేటీఆర్.. ఇంత అడ్డంగా బుక్ చేశారు?
X

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఉదంతంలో మంత్రి కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యారు. సున్నితమైన అంశాల్ని అంతే సున్నితంగా హ్యాండిల్ చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయి.. దూకుడుగా.. తన మాటల గారడితో ఏదో చేద్దామనుకున్న ఆయనకు.. తన మాటలే తనకు శాపంగా మారిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. కారణం ఏమిటన్న విషయంపై క్లారిటీ లేని వేళ.. విద్యార్థిని ప్రవళిక.. పోటీ పరీక్షల ఫలితాలు రాకపోవటం.. పరీక్షలు వాయిదా పడుతున్న నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావించిన యువతరం రోడ్ల మీదకు వచ్చి ఆమె ఆత్మహత్యపై పెద్ద ఎత్తున ఆందోళన చేసింది.

ప్రవళిక ఆత్మహత్య ఉదంతంలో పోలీసులు తప్పు మీద తప్పు చేశారు. ఎన్నికల కోడ్ అమ్మలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక ఉదంతంపై గంటల వ్యవధిలోనే ప్రెస్ మీట్ పెట్టిన డీసీపీ ఆమె పోటీ పరీక్షకు హాజరు కాలేదని.. ఆమె ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమంటూ కొత్త వాదనను వినిపించారు. దీనికి సంబంధించి పలు అంశాల్ని ప్రస్తావించారు. ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఒక విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించిన కారణాల్ని వెల్లడించే విషయంలో.. ఆమెకు కనీస హక్కుగా ఉండే వ్యక్తిగత గోపత్య విషయంలో పోలీసులు అనుసరించిన వైఖరిని పలువురు తప్పు పట్టారు.

ఆత్మహత్య చేసుకున్న పద్దెనిమిది గంటల వ్యవధిలో తీర్పులు ఇచ్చేసే తీరులో హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టటం.. వ్యక్తిగత అంశాల్ని పేర్కొంటూ.. ఆమె ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారంగా చెప్పటాన్ని తప్పు పట్టారు. ఆమె రాసినట్లుగా చెబుతున్న ఆత్మహత్య లేఖను చూస్తే.. తాను నష్టజాతకురాలినని.. తనను క్షమించాలన్న అంశాల్నే ప్రస్తావించిందే తప్పించి.. ఇంకేం వివరాల్నివెల్లడించని వేళ.. ఆమె సూసైడ్ కు ప్రేమ వ్యవహారం కారణమని పోలీసులు ఎలా చెబుతారు? అన్నది ప్రశ్నగా మారింది.

ఒకవేళ అదే నిజమైన పక్షంలోనూ.. ఆమె పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా పోలీసులు వ్యవహరించటం సరికాదన్న వాదన పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇలాంటి వేళలోనే మంత్రి కేటీఆర్ ఇదే అంశాన్ని ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపైనా పెద్ద ఎత్తున విమర్శలు రేగుతున్నాయి. ప్రవళిక పోటీ పరీక్షలు రాయలేదన్న డీసీపీ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ఆమె ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమన్న పోలీసు మాటల్ని ఉటంకించటం అందరిని ఆశ్చర్యపరిచింది.

నిత్యం సుద్దులు చెప్పే మంత్రి కేటీఆర్.. ప్రవళిక విషయంలో తొందరపాటును ప్రదర్శించారన్న వాదన బలంగామారింది.అదే సమయంలో.. ఆమె పోటీ పరీక్షలకు అప్లై చేశారన్న విషయాన్ని స్పష్టంచేసేలా.. ఆమె 5 పరీక్షలకు అప్లికేషన్ పెట్టుకున్న వివరాలు.. హాల్ టికెట్ల స్క్రీన్ షాట్లు తెర మీదకు రావటంతో.. మంత్రి కేటీఆర్ అడ్డంగాబుక్ అయిన పరిస్థితి. ప్రవళిక ఆత్మహత్యతో పోటీ పరీక్షల విషయంలో ప్రభుత్వ వైఫల్యం చర్చగా మారిన వేళ.. తమకు జరిగే డ్యామేజ్ ను తగ్గించుకోవటానికి ప్రదర్శించిన దూకుడు.. ఇప్పుడు శాపంగా మారిందంటున్నారు.

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్రమైన డ్యామేజ్ గా పేర్కొంటున్నారు. ఒక పోలీసు అధికారి చెప్పిన మాటల్ని యథాతధంగా చెప్పే బదులు.. ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉన్న కేటీఆర్ తొందరపాటును ఎందుకు ప్రదర్శించారన్నది ప్రశ్న. కీలకమైన ఎన్నికల వేళ.. అనవసర దూకుడు ప్రదర్శించిన కేటీఆర్.. తన మాటలతో పార్టీని అడ్డంగా బుక్ చేశారన్న అభిప్రాయం అంతకంతకూ పెరుగుతోంది. ఇది గులాబీ పార్టీలో కొత్త గోలగా మారినట్లు చెబుతున్నారు.