Begin typing your search above and press return to search.

ముళ్లబాటలో.. గులాబీ నేత అతి సుదీర్ఘ పాదయాత్ర..? బావకు చెక్

అయితే, వారందరినీ మించి.. పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు ఓ నేత. ఇది ఓ అతి సుదీర్ఘ పాదయాత్రగా మైలురాయిని అందుకోనుంది

By:  Tupaki Desk   |   11 July 2024 2:30 PM GMT
ముళ్లబాటలో.. గులాబీ నేత అతి సుదీర్ఘ పాదయాత్ర..? బావకు చెక్
X

తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇప్పటివరకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రలు చేసిన రాజకీయ నాయకులు.. ఇందులో వైఎస్ కుటుంబీకులే ముగ్గురు. ఇంకొందరు రాజకీయ నాయకులూ పాదయాత్రలు చేసినా.. వారివి స్వల్ప దూరమే. చరిత్రలో నిలిచిపోయిన పాదయాత్రలు అంటే మాత్రం పై నలుగురివే. అయితే, వారందరినీ మించి.. పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు ఓ నేత. ఇది ఓ అతి సుదీర్ఘ పాదయాత్రగా మైలురాయిని అందుకోనుంది.

అసెంబ్లీలో అధికారం పాయె.. లోక్ సభలో చోటే లేదాయె

గత ఏడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. రెండు నెలల కిందటి లోక్ సభ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది. మరోవైపు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు జంప్ అధికార కాంగ్రెస్ లోకి అయ్యారు. మరోవైపు ఇంకొందరు ఎమ్మెల్యేలూ ఇదే బాటలో ఉన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తెనే ఢిల్లీ మద్యం కేసులో జైలులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ భవితవ్యాన్ని కాపాడేందుకు కేసీఆర్ ఏం చేస్తారనేది ప్రశ్నగా మారింది.

ముళ్ల బాటనుంచి గట్టెక్కించేలా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ సుదీర్ఘ పాద‌యాత్ర‌కు సిద్ధం అవుతున్నారనే కథనాలు జోరుగా వస్తున్నాయి. ప్రణాళిక సిద్ధమైందని.. రోడ్ మ్యాప్ పూర్తయిందని ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ నడుస్తోంది. మంచి రోజులు వచ్చే శ్రావ‌ణ మాసం నుంచే చిన్న సారు పాద‌యాత్ర‌ మొదలుపెడతారని కూడా చెబుతున్నారు. బాస‌రలోని స‌ర‌స్వ‌తీ ఆల‌యం నుంచి మొదలుపెట్టి.. తెలంగాణలోని ప్ర‌తి జిల్లా, ప్ర‌తి మండ‌లం, ప్ర‌తి గ్రామం మీదుగా కేటీఆర్ పాద‌యాత్ర సాగ‌తుందట.

మూడున్నరేళ్ల పాటు

చంద్రబాబు, వైఎస్, జగన్, షర్మిల, లోకేశ్.. వీరిలో ఎవరూ చేయనట్లుగా.. కేటీఆర్ మూడున్న‌రేళ్ల‌ పాటు ఏకధాటిగా పాదయాత్ర సాగిస్తారట. బాస‌ర‌ నుంచి భద్రాచలంలోని రామాలయం వర‌కు రోడ్ మ్యాప్ వేస్తున్నారట. పాదయాత్ర మార్గంలో ప్ర‌తి వ‌ర్గాన్ని, ప్ర‌తి కులాన్నీ.. కేటీఆర్ క‌లుస్తార‌ని తెలిసింది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను కేటీఆర్ తెలుసుకోనున్న‌ట్టు స‌మాచారం. 2028 ఎన్నిక‌ల నాటికి క్షేత్ర‌స్థాయిలో బీఆర్ఎస్ ను బ‌లోపేతం చేయ‌డంతో పాటు.. అధికారంలోకి తీసుకురావ‌డ‌మే కేటీఆర్ లక్ష్యంగా చెబుతున్నారు.

పార్టీపై పట్టు.. హరీశ్ కు చెక్..

ఒక్క పాదయాత్రకు నాలుగు లక్ష్యాలు అన్నట్లు.. పార్టీని పటిష్ఠం చేయడం, పార్టీపై పూర్తిగా పట్టు సాధించడం, తన బావ, మాజీ మంత్రి హరీశ్ రావుకు చెక్ పెట్టడం, తనపై ఉన్న అహంకారం అన్న ఇమేజీని చెరిపేసుకోవడం కేటీఆర్ ఉద్దేశాలుగా తెలుస్తోంది. హరీశ్ కు ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పై పట్టుంది. దానిని తన చేతుల్లోకి తీసుకోవడం కేటీఆర్ ముందున్న ప్రధాన లక్ష్యం. కేసీఆర్‌ వయో భారంతో క్రియాశీల రాజకీయాలకు దూరమైతే.. హ‌రీశ్ ఏమాత్రం పోటీ లేకుండా చేసేందుకు కేటీఆర్‌ పన్నుతున్న వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పరువు నిలుపుకోవడం, వర్గాలను ప్రోత్స‌హించార‌న్న అప‌ప్ర‌ధను పోగొట్టుకోవడం, అంద‌రికీ చేరువ కావడం తదితర ల‌క్ష్యాల‌ను చేరేదుకు కూడా కేటీఆర్ అడుగులు వేస్తున్నట్లు పేర్కొంటున్నారు.