Begin typing your search above and press return to search.

మైనార్టీ పేరుతో మళ్లీ కెలుక్కున్న కేటీఆర్

రేవంత్ ప్రభుత్వంలో మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదంటూ కేటీఆర్ ఆక్షేపించారు

By:  Tupaki Desk   |   28 Jan 2024 3:30 PM GMT
మైనార్టీ పేరుతో మళ్లీ కెలుక్కున్న కేటీఆర్
X

నిత్యం ఏదో అంశం మీద మాట్లాడాలి. రేవంత్ సర్కారుపై విమర్శలు చేయాలన్నదే లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు తరచూ విమర్శలకు గురవుతున్న సంగతి తెలిసిందే. తన మాటలతో తమ పార్టీకి తలనొప్పిగా మారుతుందన్న విషయాన్ని ఆయన మిస్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. రోజు గడిస్తే చాలు.. కేటీఆర్ ఏం మాట్లాడతారో అర్థంకానట్లుగా గులాబీ నేతలు తల పట్టుకుంటున్నారు. ఎందుకంటే.. కేటీఆర్ చేసే విమర్శల్లో లాజిక్ మిస్ కావటమే కాదు.. ప్రత్యర్థులకు మరిన్ని మాటలు అనేలా అవకాశం ఇవ్వటమే దీనికి కారణంగా చెబుతున్నారు.

రేవంత్ ప్రభుత్వంలో మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదంటూ కేటీఆర్ ఆక్షేపించారు. మైనార్టీలు బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వటంతో రేవంత్ సర్కారు వారిపై పగ తీర్చుకోవటానికి వీలుగా ఈతీరులో వ్యవహరిస్తోందని విమర్శించారు. షబ్బీర్ అలీను ప్రభుత్వ సలహాదారుగా నియమించిన వైనంపైనా తప్పు పట్టారు. షబ్బీర్ కు మంత్రి పదవి ఇవ్వకుండా.. ఆయన్ను ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టి వదిలేశారంటూ వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం కొలువు తీరి కేవలం 50 రోజులే అయిన వేళ.. మైనార్టీలకు మంత్రి పదవి కేటాయించకపోవటాన్ని ఎలా ప్రశ్నిస్తారంటున్నారు. దీనికి కారణం.. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఎవరూ మైనార్టీలు లేకపోవటం ఒక సమస్య. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి వారికి మంత్రి పదవి ఇవ్వాలన్నది రేవంత్ సర్కారు ఆలోచనగా చెబుతున్నారు.

ఇప్పటికే గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన ఎమ్మెల్సీల్లో మైనార్టీ వర్గానికి చెందిన వారికి పదవి ఇవ్వటాన్ని గుర్తు చేస్తున్నారు. యాభై రోజుల పాలనలో నిత్యం తప్పులు వెతికే కేటీఆర్.. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో మొదటి ప్రభుత్వంలో మహిళా మంత్రి అన్నదే లేకుండా చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్క మహిళా మంత్రిని కూడా నియమించని విషయం కేటీఆర్ కు గుర్తు లేదా? ఏ ముఖం పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడతారు? అంటూ నిలదీస్తున్నారు. ప్రత్యర్థికి అవకాశం ఇచ్చేలా మాట్లాడే కేటీఆర్ తీరుపై గులాబీ నేతలు గుస్సా వ్యక్తం చేస్తున్నారు. కాస్తంత కసరత్తు చేసి విమర్శలు చేయాలే తప్పించి.. రోజూ మీడియాలో కనిపించాలన్న తపనతో మాట్లాడితే.. ఇలానే మాటలు పడాల్సి వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.