Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఎక్కడికైనా గంటలోనే.. 2047 హైదరాబాద్ విజన్ లెక్క ఇదే

ఎన్నికల సందర్భంగా ప్రతి మాట ఎంతోఅంతో ప్రభావం చూపుతుంది. ప్రతి నిర్ణయం ఓటర్ల నిర్ణయాన్ని మార్చేలా చేస్తుంది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 9:30 AM GMT
తెలంగాణలో ఎక్కడికైనా గంటలోనే.. 2047 హైదరాబాద్ విజన్ లెక్క ఇదే
X

ఎన్నికల సందర్భంగా ప్రతి మాట ఎంతోఅంతో ప్రభావం చూపుతుంది. ప్రతి నిర్ణయం ఓటర్ల నిర్ణయాన్ని మార్చేలా చేస్తుంది. అందుకే.. క్రికెట్ ఆటలో ఆఖరి బంతి వరకు విడవకుండా శ్రమించిన వారికే గెలుపు దక్కుతుందన్న సూత్రం.. రాజకీయ క్రీడలోనూ పని చేస్తుంది. అందునా హోరాహోరీగా సాగే ఎన్నికల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ ఎంత తీవ్రంగా ఉందనే సంగతి తెలిసిందే. అధికార విపక్షాల వారు అలుపెరగకుండా శ్రమిస్తున్నారు.

ఏ రోజుకు ఆ రోజు వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వేళ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నుంచి ఆసక్తికర వ్యాఖ్య వచ్చింది. తెలంగాణలో వేగవంతమైన ప్రజారవాణా కోసం భారీ ప్రణాళికను ఆయన చెప్పుకొచ్చారు. ఏదో మాట వరసకు అన్నట్లు కాకుండా వివరంగా చెప్పటం ద్వారా.. కొత్త ఆశలు కలిగేలా చేశారు. ఇప్పటికే పదేళ్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్న అనుభవంతో పాటు.. తమకున్న సమర్థతను పలుమార్లు ప్రదర్శించిన బలం ఎన్నికల వేళ లాభిస్తుందని చెబుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా కేవలం గంట వ్యవధిలోనే ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణించేలా ప్రజా రవాణా సదుపాయం గురించి కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా గంటలో చేరుకునేలా ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ కారిడార్లను ఆయన ప్రతిపాదించారు. ఈ ప్లాన్ వాస్తవ రూపం దాలిస్తే.. టైర్ టు పట్టణాలకు ఐటీ విస్తరించేందుకు ఉపయోగపడుతుందన్నది ఆయన ఆలోచన. ఇందులో భాగంగా 2047 హైదరాబాద్ విజన్ ప్రజెంటేషన్ లో ఈ కారిడార్ల గురించి చెప్పుకొచ్చారు.

అవుటర్ రింగు రోడ్డు వరకు మెట్రో.. అక్కడి నుంచి ర్యాపిడ్ రైల్ ను తీసుకురానున్నట్లు చెప్పారు కేటీఆర్. ఎన్నికల వేళ ఏదో మాట వరసకు అన్నట్లు కాకుండా తాను అనుకున్న రూట్ మ్యాప్ వివరాల్ని కూడా వెల్లడించారు. దీని ప్రకారం చూస్తే..

- శామీర్ పేట ఓఆర్ఆర్ (140కి.మీ)

శామీర్ పేట - గజ్వేల్ - కొమరవెల్లి - సిద్దిపేట - కరీంనగర్

- ఘట్ కేసర్ ఓఆర్ ఆర్ (113 కి.మీ.)

బీబీ నగర్ - యాదాద్రి - జనగాం - రఘనాథ పల్లి - స్టేషన్ ఘన్ పూర్ - వరంగల్

- పెద్ద అంబర్ పేట్ ఓఆర్ఆర్ (81కి.మీ.) , (111కి.మీ.)

1. చౌటుప్పల్ - చిట్యాల - నార్కట్ పల్లి - నల్గొండ

2. నార్కట్ పల్లి - నరిరేకల్ - సూర్యాపేట - కూసుమంచి - ఖమ్మం

- శంషాబాద్ ఓఆర్ఆర్ (50కి.మీ.)

షాద్ నగర్ - జడ్చర్ల - మహబూబ్ నగర్

- అప్పా ఓఆర్ఆర్ (60కి.మీ.)

మొయినాబాద్ - చేవెళ్ల - మన్నెగూడ - వికారాబాద్

- ముత్తంగి ఓఆర్ఆర్ (64కి.మీ.)

ఇస్నాపూర్ - సంగారెడ్డి - సదాశివపేట - జహీరాబాద్

- కండ్లకోయ ఓఆర్ఆర్ (70కి.మీ.), (103కి.మీ.)

1. మేడ్చల్ - మనోహరాబాద్ - మూసాయి పేట - చేగుంట - మెదక్

2. చేగుంట - రామాయంపేట - బక్ నూర్ - కామారెడ్డి - డిచ్ పల్లి - నిజామాబాద్