''గోదావరిలో కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోయాయ్''
ప్రస్తుతం గోదావరికి ఉరకలెత్తుతున్న వరద నీటితో కాళేశ్వరం ప్రాజెక్టు కళకళలాడుతోంది.
By: Tupaki Desk | 21 July 2024 3:15 AM GMTకొన్నాళ్లుగా తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుపై వివాదం రగులుతున్న విషయం తెలిసిందే. దీనిలో మాజీ సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని.. పేర్కొంటూ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సహా.. కాంగ్రెస్ మంత్రు లు కూడా ఆరోపించారు. ఈ వివాదాన్ని ఉటంకిస్తూ.. బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''ప్రస్తుతం గోదావరికి ఉరకలెత్తుతున్న వరద నీటితో కాళేశ్వరం ప్రాజెక్టు కళకళలాడుతోంది. దీనిలో కాంగ్రెస్ పార్టీ కుట్రలు కొట్టుకు పోయాయ్'' అని వ్యాఖ్యానించారు.
సుదీర్ఘ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. ఒక్కొక్క బొట్టును ఒడిసి పట్టుకుని తెలంగాణను సస్య శ్యామలం చేయాలన్న సంకల్పంతో కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారని.. అయినా.. కొందరు దీనిపై విషం చల్లాలని కుట్ర పన్నారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కానీ, ఇప్పుడు వస్తున్న భారీ వరదను ఒడిసిపట్టుకుని.. కాళేశ్వరం.. కళకళలాడుతోందని తెలిపారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలు ఈ వరదలో కొట్టుకు పోయాయని వ్యాఖ్యానించారు.
''పోటెత్తిన వరదకు దుష్టశక్తుల.. పన్నాగాలు పటాపంచలయ్యాయి. కానీ.. కేసీఆర్ సమున్నత సంకల్పం.. జై కొడుతోంది.. జల హారతి పడుతోంది. లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో.. లక్షకోట్లు వృథా చేశారనే విమర్శలు గల్లంతయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీ మాత్రం.. మొక్కవోని దీక్షతో నిలబడింది. కొండంత బలాన్ని చాటిచెబుతోంది'' అని కేటీఆర్ ఎక్స్‌లో స్పష్టం చేశారు. దీనికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత ఫొటోలను ఆయన జత చేశారు.
మేడిగడ్డ ప్రాజెక్టును మేటి గడ్డగా అభివర్ణించారు. కాళేశ్వరం తెలంగాణ కరువును పోగొట్టే.. కల్పతరువుగా పేర్కొన్నారు. ''బురద రాజకీయాలను భూస్థాపితం చేసిన మానవ నిర్మిత అద్భుతానికి, నిర్మించిన కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం పక్షాన సెల్యూట్ చేస్తున్నాం'' అని కేటీఆర్ పేర్కొన్నారు. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.