నిండు అసెంబ్లీలో జగన్...చంద్రబాబులకు థాంక్స్ చెప్పిన కేటీయార్
ఏపీ సీఎం జగన్ విపక్ష నేత చంద్రబాబుల గురించి వారు గతంలో అన్న మాటల గురించి చెప్పి మరీ కేటీయార్
By: Tupaki Desk | 5 Aug 2023 3:22 PM GMTఏపీకి చెందిన ముఖ్యమంత్రి, విపక్ష నేతలకు నిండు అసెంబ్లీలో థాంక్స్ అంటూ బీయారెస్ మంత్రి కేటీయార్ చెప్పడం విశేషం. ఆయన అసెంబ్లీలో ఒంటి చేత్తో విపక్షాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణాలో తమ పాలన బాగుందని చెప్పుకోవడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే టైం లో ఏపీ నాయకులను కూడా సీన్ లోకి తీసుకుని వచ్చి మరీ కేసీయార్ పాలనకు వారు శభాష్ చెప్పారని కోట్ చేయడం కేటీయార్ కే చెల్లింది.
ఆయన శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ చంద్రబాబు కేసీయార్ పాలన బాగుందని మెచ్చుకుంటూంటే మీకు మాత్రం అర్ధం కాదు అని ప్రతిపక్షాలను పట్టుకుని విమర్శించారు.
దిశ సంఘటన జరిగినపుడు తెలంగాణా ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం వ్యవహరించిన తీరుని ఏపీ అసెంబ్లీలో జగన్ మెచ్చుకుని కేసీయార్ కి సెల్యూట్ చేస్తున్నాను అని చెప్పడాన్ని కేటీయార్ ఇన్నేళ్ళ తరువాత గుర్తుకు తెచ్చారు.
తెలంగాణాలో లా అండ్ ఆర్డర్ ని ఎంత బాగా తమ ప్రభుత్వం నిర్వహిస్తోందో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మెచ్చుకోవడం ఒక ఉదాహరణ కాదా అని ఆయన అంటున్నారు. ఇక మెడ మీద కత్తి పెట్టినా తెలంగాణాలో రైతుల పొలాలలో మోటర్లకు మీటర్లు పెట్టకుండా కేసీయార్ నిలబడ్డారని, రైతు పక్షపాతి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మెచ్చుకున్నారని మరో ఉదంతాన్ని సభ ముందు ఉంచారు కేటీయార్.
అంతే కాదు ఏపీలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణాలో వంద ఎకరాలు కొనుగోలు చేసే పరిస్థితి పోయి తెలంగాణాలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో యాభై ఎకరాలు కొనే పరిస్థితి ఉందని చంద్రబాబు చెప్పినది తాను టీవీలలో చూశానని కేటీయార్ అన్నారు. అంతలా తెలంగాణా అభివృద్ధిని చేసిన ఘనత కేసీయార్ ది అని చంద్రబాబు ప్రశంసలు కురిపిస్తూంటే కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్కకు, అలాగే ఎమ్మెల్యే శ్రీధర్ బాబులకు అర్ధం కావడం లేదా అని నిలదీశారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావులకు నిజాలు ఎందుకు కనిపించవని కూడా కేటీయార్ సెటైర్లు వేశారు.
తెలంగాణా శాసనసభలో ఏపీ సీఎం జగన్ విపక్ష నేత చంద్రబాబుల గురించి వారు గతంలో అన్న మాటల గురించి చెప్పి మరీ కేటీయార్ లౌక్యంగా ఏపీ కంటే తెలంగాణా మెరుగు అనిపించేశారు అంటున్నారు.
అది కూడా పాలిస్తున్న సీఎం, నిన్నటి దాకా పాలించిన మాజీ సీఎం లే తెలంగాణా గ్రేట్ అంటున్నారు అని చెప్పడం ద్వారా రాజకీయ తెలివిడిని కేటీయార్ ప్రదర్శించారు అని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే ఏపీ ఫెయిల్యూర్స్ ని సొంత రాష్ట్రం నేతలే ఒప్పుకున్నారని తెలంగాణా మంత్రి ఇండైరెక్ట్ గా చెప్పేశారా అన్న చర్చ కూడా నడుస్తోంది.