Begin typing your search above and press return to search.

జాబితా వేళ అమెరికాకు కేటీఆర్.. టికెట్ల గోల తప్పేలా..?

కీలకమైన ఎన్నికలకు అభ్యర్థులను వెల్లడించే సమయంలో కేటీఆర్ ఉండాలి. కానీ ఈసారి అలా జరగడం లేదు.

By:  Tupaki Desk   |   21 Aug 2023 9:14 AM GMT
జాబితా వేళ అమెరికాకు కేటీఆర్.. టికెట్ల గోల తప్పేలా..?
X

మరికాసేపట్లో తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఏకంగా 85 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నారు. తొలుత అనుకున్న వాటిలోనూ మూడు, నాలుగు స్థానాలను పెండింగ్ లో పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. అంతేగాక వామపక్షాలతో పొత్తు నేపథ్యంలో మరికొన్ని సీట్లపైగా సందిగ్ధత సాగుతోంది. అయితే, మొత్తానికి 85 శాతంవరకు సీట్లకు ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను వెల్లడించి బీఆర్ఎస్ పోటీలో ముందంజ వేసింది.

కార్యనిర్వహక అధ్యక్షుడు లేకుండానే?

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ కు నాలుగేళ్ల కిందట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి పార్టీ వ్యవహారాలను కేటీఆరే నేరుగా పర్యవేక్షిస్తున్నారు. నేతలు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలను నేరుగా పరిష్కరిస్తున్నారు. ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ లో మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య సర్దిచెప్పే యత్నం చేశారు. మరోవైపు పార్టీ కార్యక్రమాల పైనా పర్యవేక్షణ చేస్తున్నారు. కాగా, బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన సందర్భంగా సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ ఉండాలి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగానూ ఇందులో ఆయన పాలుపంచుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకపోయిన సీఎం కేసీఆర్, పార్టీ వ్యవస్థాపకుడి కుమారుడిగా, పార్టీలో కీలక నేతగా అయినా.. కీలకమైన ఎన్నికలకు అభ్యర్థులను వెల్లడించే సమయంలో కేటీఆర్ ఉండాలి. కానీ ఈసారి అలా జరగడం లేదు.

తలనొప్పులు ఎందుకనా?

కాబోయే సీఎంగానూ కేటీఆర్ ను తెలంగాణ మంత్రులు పలువురు ఇప్పటికే కీర్తించారు. కేసీఆర్ కూడా గతంలో తనకు వయసు మీద పడుతోందని వ్యాఖ్యానించారు. ఈ లెక్కన చూసినా వచ్చే ఎన్నికలు బీఆర్ఎస్ కు అత్యంత కీలకం. ఒకవేళ మళ్లీ అధికారంలోకి వస్తే రెండు మూడేళ్లకు అయినా కేటీఆర్ సీఎం అవుతారని అంటున్నారు. కానీ, సోమవారం అభ్యర్థుల జాబితా వెల్లడి సందర్భంగా మాత్రం కేటీఆర్ ఉండడం లేదు. వాస్తవానికి ఈసారి టికెట్ ఎంపికలు కేటీఆర్ నేరుగా పర్యవేక్షణ లోనే సాగాయని చెబుతున్నారు. చివరకు మాత్రం పేర్ల వెల్లడి సందర్భంగా ఆయన ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు. ఇప్పటికే కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. కుమారుడు హిమాన్షు చదువు, తెలంగాణకు పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను కలుస్తారని చెబుతున్నారు.

అయితే, దీనివెనుక అసలు ఉద్దేశం.. తెలంగాణలో అభ్యర్థుల ప్రకటన సందర్భంగా వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకే ఇలా చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టికెట్ రాలేదన్న అసమ్మతులను నివారించేందుకే అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. వాస్తవానికి గతంతో పోలిస్తే కేటీఆర్ కు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులలో పరిచయాలు బాగా పెరిగాయి. అందరినీ కలుపుకొని పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ అనివార్యతను నివారించేందుకే కేటీఆర్ అమెరికా టూర్ పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది.