Begin typing your search above and press return to search.

మైనార్టీల గురించి గుండెలు బాదుకునే కేటీఆర్.. దీనికేమంటావ్?

మొన్నటికి మొన్న రేవంత్ మంత్రివర్గంలో మైనార్టీలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని.. మైనార్టీలంటే మంట అంటూ నిందారోపణలు చేయటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 Jan 2024 6:20 AM GMT
మైనార్టీల గురించి గుండెలు బాదుకునే కేటీఆర్.. దీనికేమంటావ్?
X

తెలంగాణలో రేవంత్ సర్కారు ఏర్పిన వారం రోజుల నుంచే అదే పనిగా విమర్శలు చేయటం.. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ రంధ్రాన్వేషణ చేయటం.. విమర్శల మీద విమర్శలు చేయటమే కాదు.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్ని ఎందుకు పరిష్కరించరంటూ అదే పనిగా ప్రశ్నిస్తూ.. తన తీరుతో ప్రజలకు సైతం ఇరిటేట్ చేస్తున్న మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరైన కేటీఆర్ తాజా పరిణామాలకు సమాధానం చెప్పాల్సిందేనని అంటున్నారు. మొన్నటికి మొన్న రేవంత్ మంత్రివర్గంలో మైనార్టీలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని.. మైనార్టీలంటే మంట అంటూ నిందారోపణలు చేయటం తెలిసిందే.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న 64 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు కూడా మైనార్టీ లేరు. ఏదోలా మైనార్టీ నుంచి ఒకరిని కేబినెట్ కు ఎంపిక చేయాలని రేవంత్ సర్కారు అనుకుంటోంది. అందుకు తగ్గ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. పార్టీకి సీనియర్ అయిన షబ్బీర్ అలీని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. షబ్బీర్ కు మంత్రి పదవి ఇవ్వకుండా సీఎం రేవంత్ మైనార్టీలను అణగదొక్కుతున్నారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

కేటీఆఱ్ వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఒకవైపు మైనార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ గెలవకుండానే వారికి మంత్రి పదవి ఇవ్వలేదని ఎలా అంటారన్న ప్రశ్నతో పాటు..కేసీఆర్ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వేళ.. మహిళా మంత్రి అన్నదే లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన వైనాన్ని పలువురు గుర్తు చేశారు. తాజాగా గవర్నర్ కోటాలో అమిర్ అలీఖాన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

గత ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో తమను ఎంపిక చేస్తే.. అభ్యంతరాలు వ్యక్తం చేయటం ద్వారా తాము ఎమ్మెల్సీలం కాలేకపోయినట్లుగా పేర్కొంటూ దాసోజ్ శ్రవణ్.. సత్యనారాయణలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి.. ఈ రోజు (బుధవారం, జనవరి31)న ప్రమాణస్వీకారం జరగాల్సిన దానిని ఆగిపోయేలా హైకోర్టును ఉత్తర్వులు తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు. వారు చేసింది సరైందా? కాదా? అన్నది పక్కన పెడితే.. ఒక మైనార్టీ నేతకు ఎమ్మెల్సీ పదవి వచ్చే అవకాశాన్ని తమ పార్టీ అడ్డుకుందన్న విమర్శపై మాత్రం కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు. మైనార్టీ నేతలకు పదవులు ఇవ్వటం లేదని రేవంత్ సర్కారుపై ఆడిపోసుకునే కేటీఆర్.. ఇప్పుడు పదవి ఇచ్చిన వేళ అడ్డుకున్న తమ పార్టీ నేతను ఎందుకు నియంత్రించలేదు? అన్నది ప్రశ్న. మైనార్టీ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా కేటీఆర్ అండ్ కో వ్యవహరించలేదా? అన్న సందేహానికి ఆయన సమాధానం ఇవ్వాల్సిందేనన్న మాట వినిపిస్తోంది.