ఉత్తరాంధ్ర కు మహర్దశ...కూటమి ప్లాన్ అదుర్స్ !
ఉత్తరాంధ్ర జిల్లాలు ఉమ్మడి ఏపీలోనూ అలాగే విభజన ఏపీలోనూ అత్యంత వెనుకబాటుతనాన్ని కలిగి ఉన్నవని తెలిసిందే.
By: Tupaki Desk | 18 Feb 2025 11:30 AM GMTఉత్తరాంధ్ర జిల్లాలు ఉమ్మడి ఏపీలోనూ అలాగే విభజన ఏపీలోనూ అత్యంత వెనుకబాటుతనాన్ని కలిగి ఉన్నవని తెలిసిందే. ఒక్క విశాఖ సిటీ తప్పించి విశాఖ రూరల్ తో మొదలెడితే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పూర్తిగా వెనకబడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర మీద ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెడుతోంది.
ఉత్తరాంధ్రాకి ఇపుడు జీవనాడిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. దానిని కనుక సకాలంలో పూర్తి చేసినట్లు అయితే ఈ మూడు ఉమ్మడి జిల్లాల దశ తిరిగినట్లే అని అంటున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుని ప్రస్తుతం 22 వేల ఎకరాలలో నిర్మిస్తున్నారు . అయితే దానికి అదనంగా మరో అయిదు వందల ఎకరాలను కూటమి ప్రభుత్వం కేటాయిస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
నిజానికి టీడీపీ ప్రభుత్వం 2018లో భోగాపురం వద్ద ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం పాతిక వేల ఎకరాలను కేటాయించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చకా దానిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మరో అయిదారు వందల ఎకరాల భూమిని కనుక అప్పగిస్తే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో పాటు ఎయిర్ కార్గోను కూడా ఏర్పాటు చేయడం అలాగే ఎయిర్ పోర్టు పరిసరాలలో అభివృద్ధి పనులకు ప్రాజెక్టులు రెడీ చేయడానికి వీలు ఉంటుందని ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న జీఎమ్మార్ సంస్థ కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ వస్తోంది.
దీని మీద ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భోగాపుప్రం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు అదనపు భూములు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ మంత్రుల కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. ఆ మీదట తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో అయిదు వందల ఎకరాల భూమిని ఈ ఎయిర్ పోర్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం ఆమోద ముద్ర వేయబోతోంది.
ఇదే కనుక జరిగితే ఉత్తరాంధ్రాలో అతి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో ఈ వెనకబడిన ప్రాంతం దశ తిరగనుంది అని అంటున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కావడంతో దేశంలోని నలుమూల నుంచి మాత్రమే కాకుండా విదేశీయులు కూడా ఈ ఎయిర్ పోర్టుకి రాకపోకలు సాగిస్తారు. దాంతో ఎయిర్ ట్రాఫిక్ అధికం అవుతుంది. దాంతో అనుబంధ వ్యాపారాలు పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు.
అదే విధంగా ఎయిర్ కార్గో టెర్మినల్స్ కి ఈ అయిదు వందల అదనపు భూములలో ఏర్పాటు చేయనుండడంతో దేశీయ విదేశీయ ఎగుమతులకు ఎంతో ఆస్కారం ఉంటుంది అని అంటున్నారు. ఇది ఉత్తరాంధ్రకే కాకుండా గోదావరి కోస్తా జిల్లాలకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు.
ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్స్ వస్తే కనుక ఆక్వా ఫార్మా ఎగుమతులకు సులువైన మార్గం దొరుకుతుంది. అంతే కాకుండా స్థానిక ఉత్పత్తులకు విదేశీ మార్కెట్ కూడా దొరుకుతుంది. దాంతో వాణిజ్యం కూడా బాగా ఊపందుకుంటుంది అని అంటున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లొకేట్ అయి ఉన్నది కూడా ఉత్తరాంధ్రలోని కీలకమైన చోటనే. అది కూడా విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల మధ్యలోనే.
దాంతో ఈ ఎయిర్ పోర్టు ఒక్కసారి కనుక ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తే ఉత్తరాంధ్ర దశ అతి కొద్ది కాలంలోనే మారిపోతుందని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు మాదిరిగానే ఇది కూడా సమీప భవిష్యత్తులో వెలుగొందుతుందని అంటున్నారు. దాంతో కూటమి ప్రభుత్వం కూడా భోగాపురం ఎయిర్ పోర్టు మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. మొదటి దశ పనులు 2026 నాటికి పూర్తి చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు.