Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డులు, ఇళ్లు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

క్షేత్రస్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పిన వారికే సంక్షేమ పథకాలు లబ్ధి అందుతుందన్న విషయాన్ని కొందరు నేతలు స్పష్టం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Jan 2025 9:21 AM GMT
కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డులు, ఇళ్లు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులను ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధిని అందిస్తామని చెబుతోంది. పార్టీలకు అతీతంగా అర్హులైతే చాలు అని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ముఖ్య నేతల వరకు మాటలు చెబుతున్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పిన వారికే సంక్షేమ పథకాలు లబ్ధి అందుతుందన్న విషయాన్ని కొందరు నేతలు స్పష్టం చేస్తున్నారు.

తాజాగా ఇదే విషయాన్ని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కార్యకర్తలు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని బహిరంగ సభ వేదికగా ఆయన ప్రకటించారు. ఏదైనా గ్రామంలో తమ కార్యకర్తలు చెప్పినట్టు వినకుండా అధికారులు లబ్ధిదారులు జాబితా బయట పెడితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఆయా గ్రామాల్లో ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు రాకుండా చేస్తామని బహిరంగంగా ఆయన హెచ్చరించారు. గ్రామ సభల్లో ఇల్లు, రేషన్ కార్డులు వస్తాయని చెబుతారని.. అవి అంతవరకేనని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా ఉండి వచ్చే జాబితాను అనౌన్స్ చేయకుండా చూడాలని స్పష్టం చేశారు. తాను సుఖవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి 24 గంటలు ప్రజల సేవలో ఉంటున్నానని పేర్కొన్నారు. కార్యకర్తలకు ఎటువంటి సమస్య ఉన్న తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆ గ్రామంలోని కార్యకర్తలు, నాయకులు చెప్పిన వారికే ఇండ్లు, రేషన్ కార్డులు ఇప్పిస్తామని, లేకపోతే ఒక్కరికి ఇవ్వబోమని స్పష్టం చేశారు. కలెక్టర్‌కి కూడా ఈ తరహా ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహా కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నారు.

మొదట ఎమ్మెల్యే దగ్గరకు లిస్టు పెడుతుందని ఆయన టిక్కు పెట్టిన తర్వాత జాబితా విడుదలవుతుందన్నారు. లిస్టులు విడుదల చేయవద్దని ఇప్పటికే అధికారులకు చెప్పామని వెల్లడించారు. తాను 24 గంటలు మన కార్యకర్తలు, ప్రజల గురించి ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యకర్తలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు. తన కోసం గడిచిన ఎన్నికల్లో పనిచేశారని, ఇప్పుడు మీకోసం మీరంతా పనిచేయాలని సూచించారు. దానికి తాను పాటుపడతానని పేర్కొన్నారు. మనకోసం కార్యకర్తలు కష్టపడ్డారని, వారికోసం మనం కూడా కష్టపడాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కార్యకర్తలు అపోహలు పెట్టుకోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవని, మనమంతా హస్తం గుర్తు పార్టీలో ఉన్నామన్నారు.