Begin typing your search above and press return to search.

డెహ్రాడూన్ టూ బెజవాడ... నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం!

ఏపీ రాజకీయాల్లో ముంబై నటి జెత్వానీ కేసు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Sep 2024 7:17 AM GMT
డెహ్రాడూన్ టూ బెజవాడ... నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం!
X

ఏపీ రాజకీయాల్లో ముంబై నటి జెత్వానీ కేసు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో తనను, తన కుటుంబాన్ని వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ వేధించాడని.. ఈ విషయంలో ముగ్గురు ఐపీఎస్ లు తనను చిత్రహింసలకు గురిచేశారంటూ ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనంగా మారాయి. ఈ సమయంలో ఆ కేసులో అరెస్టులు మొదలయ్యాయి.

అవును... ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై నటి కాదాంబరి జెత్వానీ కేసులో అరెస్టులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్ట్ చేసి, విజయవాడకు తీసుకొచ్చారు. డెహ్రాడూన్ నుంచి ట్రైన్ లో విద్యాసాగర్ ను తీసుకుని అర్ధరాత్రి నగరానికి చేరుకున్నారు.

అనంతరం విద్యాసాగర్ ను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు.. ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సమయంలో నిందితుడికి న్యాయమూర్తి వచ్చే నెల 4 వరకూ రిమాండ్ విధించారు. దీంతో... అతడిని విజయవాడ సబ్ జైలుకు తరలించారు.

కాగా... ముంబైలోని ఓ పారిశ్రామికవేత్తపై కాదంబరీ జెత్వానీ పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా వేదింపులు జరిగాయని.. ఆ వేధింపుల్లో భాగంగా కుక్కల విద్యాసాగర్ ను వైసీపీ ప్రభుత్వం పావుగా వాడుకుందని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇబ్రహీంపట్నం పీఎస్ లో జెత్వానీపై విద్యాసాగర్ కేసు పెట్టారు.

దీంతో... ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి విజయవాడ జైలుకు పంపించారు. అనంతరం సదరు పారిశ్రామిక వేత్తపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుని ఆమె ముంబైకి వెళ్లి పోయింది. దీంతో.. నాడు ఆ వ్యవహారం ముగిసింది. అయితే నాదు జెత్వానీపై విద్యాసాగర్ పెట్టిన కేసు తప్పుడు కేసని తేలడంతో ఈ వ్యవహారంలో ఆయనను ఏ1గా చేర్చారు.

మరోపక్క ఈ వ్యవహారంలో ఐపీఎస్ అధికారుల పాత్ర కీలకంగా ఉందనే విషయం నిర్ధారణ అయ్యిందని.. ఫలితంగా వారిని కూడా కలిపి ఛార్జిషీటు తయారు చేయనున్నారని అంటున్నారు. దీంతో... ఇటీవల సస్పెండ్ అయిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.