కులగణన డేట్ సడెన్ గా మారింది...మ్యాటరేంటి...?
అయితే మరో రెండు రోజులలో కులగణన మొదలవుతుంది అనగా సడెన్ గా డేట్ ని ప్రభుత్వం మార్చేసింది. డిసెంబర్ 9 నుంచి కులగణన ఏపీ వ్యాప్తంగా చేపడతామని ప్రభుత్వం నిర్ణయించింది.
By: Tupaki Desk | 24 Nov 2023 1:59 PM GMTఏపీలో కులగణన చేపట్టాలని వైసీపీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అది కూడా ఈ నెల 27 నుంచి పెద్ద ఎత్తున చేపట్టాలని డిసెంబర్ 3 నాటికల్లా జస్ట్ వారం రోజుల వ్యవధిలో ముగించాలని కూడా భావించింది. ఇలా చాలా వేగంగా కుల గణన చేసి వాటి ఫలాలను బడుగు వర్గాలకు అందించాలన్న ఉద్దేశ్యంతో జెట్ స్పీడ్ తో వైసీపీ సర్కార్ ముందుకు వచ్చింది
అయితే మరో రెండు రోజులలో కులగణన మొదలవుతుంది అనగా సడెన్ గా డేట్ ని ప్రభుత్వం మార్చేసింది. డిసెంబర్ 9 నుంచి కులగణన ఏపీ వ్యాప్తంగా చేపడతామని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఎందుకు ఇలా డేట్ మార్చేశారు అన్నది ఇపుడు రాజకీయ వర్గాలలో చర్చగా ఉంది. అయితే దీని మీద బీసీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సమగ్ర కులగణన చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు
అందుకే డిసెంబర్ 9 నుండి ఏపిలో కులగణన ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అంతే కాదు సమగ్ర కులగణన పేదవాడి జీవితానికి భద్రతని, అందువల్ల ప్రజల జీవన స్థితి మారడానికి కులగణన అవసరమని ఆయన నొక్కి చెప్పారు. భారత దేశంలో చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత జనగణన తప్ప కులగణన జరగలేదని ఆయన అంటున్నరు. ఇక సామాజిక సాధికారితకు అసలైన చిరునామా ఎవరంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కీర్తించారు
ఇదిలా ఉంటే కులగణన ఎందుకు వాయిదా పడింది అంటే మరింత సమగ్రంగా చేయడం కోసం కుల సంఘాల నాయకుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని అన్నారు. ఆ ప్రక్రియ మరికొంత కాలం కొనసాగించేందుకు వీలుగానే మరో పదిహేను రోజుల పాటు వాయిదా వేశినట్లుగా తెలుస్తోంది. అంతే కాదు కులగణన మీద ఏపీలో ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి ఆయా వర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్నామని అంటున్నారు
అలాగే ఏపీలో జరిగే కులగణన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని మంత్రి చెల్లుబోయిన చెబుతున్నారు. సమగ్ర కులగణన సామాజిక కోణంలో జరుగుతుందని ఆయన అంటున్నారు. ఇక ఏపీలోని ప్రతిపక్షాలకు కులగణన అంటే వెన్నులో వణుకు పుడుతోందని మంత్రి అంటున్నారు. అందుకే తాము చేసి తీరుతామని కూడా అంటున్నారు.
ఇదిలా ఉంటే కులగణన డేట్ మార్చడం వెనక తెలంగాణా ఎన్నికల హడావుడి కూడా ఉందని అంటున్నారు. ఈ ఎన్నికలు నవంబర్ 30న జరుగుతాయి. ఫలితాలు మూడున వస్తాయి. అంతా ఆ హడావుడితో ఉంటారు. ఏపీ అంతా ఇపుడు తెలంగాణా వైపు చూస్తోంది. దాంతో ఫోకస్ కులగణన వైపు ఉండదు అన్న ఆలోచనతోనే వాయిదా వేశారు అని అంటున్నారు.
అంతే కాదు కులగణన చేపట్టాలని ప్రభుత్వం భావించిన సంబంధిత కుల సంఘాలు వివిధ కులాలలో ఈ కార్యక్రమం గురించి ఇంకా గ్రౌండ్ లెవెల్ దాకా సమాచారం చేరి చర్చలు జరగడం లేదన్న భావన కూడా ఉంది అంటున్నారు.
అందువల్ల మరింత లోతుగా ఆయా కుల సంఘాల నేతలతో గ్రౌడ్ లెవెల్ లో ఎక్కడికక్కడ సమావేశలు పెట్టి దీని మీద విస్తృత చర్చలు జరిపించాలని, అలా వైసీపీ ప్రభుత్వం మీద పాజిటివిటీని పెంచుకోవాలని చూస్తున్నారు అంటున్నారు. దాంతో డిసెంబర్ 9 డేట్ ఫిక్స్ చేశారు. మరి ఆ ముహూర్తం ఎలాంటిదో చూడాల్సి ఉంది అంటున్నారు.