Begin typing your search above and press return to search.

ట్రంప్ చేతికి పగ్గాల వేళ కుమార మంగళం బిర్లా కీలక వ్యాఖ్యలు

2024-25 ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకున్న పరిణామాలపై విశ్లేషించిన సందర్భంగా బిర్లా ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   21 Jan 2025 4:41 AM GMT
ట్రంప్ చేతికి పగ్గాల వేళ కుమార మంగళం బిర్లా కీలక వ్యాఖ్యలు
X

పరిణామం ఏదైనా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్లే ప్రముఖులు కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా. అమెరికా అధ్యక్ష పదవిని మరోసారి ట్రంప్ చేపట్టిన సందర్బంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితి.. వ్యాపారాలపై ఎలాంటి ప్రభావాలు పడతాయన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకున్న పరిణామాలపై విశ్లేషించిన సందర్భంగా బిర్లా ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఓవైపు అవకాశాలు.. మరోవైపు అనిశ్చితి ఉంటుందన్న బిర్లా.. ‘‘2025లో ప్రపంచంలో అనిశ్చితి.. అనూహ్యమైన.. సాంప్రదాయానికి భిన్నమైన పరిస్థితులు నెలకొంటాయి. భారత్ వెలుపల అమెరికా మాకు అతి పెద్ద మార్కెట్. అక్కడ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాం. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం అవుతాయి. ట్రంప్ తిరిగి అధికారాన్ని చేపట్టటం కారణంగా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో మార్పులకు దారి తీయొచ్చు’’ అన్న అంచనాల్ని వేశారు.

పారిశ్రామిక సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నప్పటికి అంతగా గుర్తింపునకు నోచుకోని భారత్.. ఇప్పుడు అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు సంసిద్ధంగా ఉంది. యాపిల్ ఉత్పత్తుల తయారీ భారత్ కు రావటం మంచి పరిణామం. త్వరలోనే ప్రపంచంలోనే పావు వంతు ఐఫోన్లు భారత్ లోనే ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. భారతీయ ఆటోమొబైల్.. సిమెంట్ పరిశ్రమ మొదలవన్నీ అంతర్జాతీయంగా ఎదురుగుతున్నాయి. గ్లోబల్ తయారీ రంగంలో భారత్ కీలక పాత్ర పోషించగలదు’ అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాబోయే పదేళ్లలో ప్రపంచాన్ని ఏకం చేయగలిగే శక్తిగా టెక్నాలజీని వినియోగించుకోవాల్సి ఉందన్న కుమార మంగళం వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.