Begin typing your search above and press return to search.

సినిమా చెట్టుకు చిగుర్లు..సంతోషంలో `కుమార దేవం`!

ఈ ప్రక్రియకు 50 రోజుల సమయం పడుతుందని తొలుత భావించారు. అయితే నెల రోజుల్లోనే చెట్టుపై చిన్న చిన్న చిగురులు మొద‌ల‌య్యాయి.

By:  Tupaki Desk   |   10 Oct 2024 10:30 PM GMT
సినిమా చెట్టుకు చిగుర్లు..సంతోషంలో `కుమార దేవం`!
X

తూర్పుగోదావ‌రి జిల్లా కొవ్వురూ మండ‌లం కుమార‌దేవంలోని 150 ఏళ్ల వ‌య‌సు గ‌ల `సినిమా చెట్టు`( నిద్ర‌ గ‌న్నేరు) భారీ వ‌ర్షాల కార‌ణంగా కూలిపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో సినీ ప‌రిశ్ర‌మ‌కు- ఆచెట్టుతో ఉన్న అనుబంధం తెగిన‌ట్లు అయింది. ఆ చెట్టుతో కుమార‌దేవం గ్రామ‌స్తుల అనుబంధం ఈ నాటిది కాదు. శ‌తాబ్దిన‌ర కాలంగా కొన‌సాగుతూ వ‌చ్చింది. అలాంటి చెట్టు కూలిపోవ‌డంతో స‌ద‌రు గ్రామ‌స్తులు ఎంతో భావోద్వేగానికి గుర‌య్యారు. ఆ చెట్టు జ్ఞాప‌కాల్ని అంతా నెమ‌ర వేసుకున్నారు.

ఆ చెట్టు ఓ జ్ఞాప‌కంలా మిగిలిపోకుండా ఆ చెట్టు ర‌క్ష‌ణ‌కు పాటు పాడ‌ల‌ని ఇండ‌స్ట్రీ స‌హా రాజ‌మండ్రి జిల్లా వాసులు కూడా న‌డుం బిగించారు. మళ్లీ చిగురిస్తే తమ ఊరికి పూర్వ వైభవం వస్తుందని గ్రామస్తులు అంతా ఆశించారు. తాజాగా ఈ చెట్టు మళ్లీ లేలేత చిగుళ్ళతో ఊపిరి పోసుకుంటుంది. అందుకు రాజ‌మండ్రి రోటరీ సభ్యుల కృషిని కొనియాడాలి. రోట‌రీ స‌భ్యులు చెట్టు మానును క‌ట్చేసి ర‌సాయ‌న ప్ర‌క్రియ ద్వారా ఈ చెట్టుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు.

ఈ ప్రక్రియకు 50 రోజుల సమయం పడుతుందని తొలుత భావించారు. అయితే నెల రోజుల్లోనే చెట్టుపై చిన్న చిన్న చిగురులు మొద‌ల‌య్యాయి. కొత్త‌గా చిగుళ్లు రావ‌డం గ‌మ‌నించి ఆ చెట్టు ప్రేమికులు ప‌ర‌వ శిస్తున్నారు. భూమిపై నున్న మానుపై ..చెట్టు కింద భాగంలో చిగుళ్లు మొద‌ల‌య్యాయి. ప్రస్తుతం వివిధ చికిత్సల ఫలితంగా పునర్జీవం పోసుకుంటుంది.

అటువైపుగా వెళ్లేవారు ఎవ‌రూ చెట్టు చిగుళ్ల‌కు ఎలాంటి హాని చేయ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటు న్నారు. మరో నెల రోజుల్లో సినిమా చెట్టు యేపుగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే వచ్చే అక్టోబర్ నాటికి పదిమంది కూర్చుని చెట్టు కింద సేదతిరే పరిస్థితి వస్తుందని రోటరీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా చెట్టు మ‌ళ్లీ నెట్టింట వైర‌ల్ గా మారింది.