Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రి హిందీ పాట్లు.. ట్యూటర్ ను పెట్టుకుని ప్రత్యేక పాఠాలు

పైగా పార్లమెంటు సమావేశాల్లో వివిధ ప్రాంతాల ఎంపీలకు సమాధానం ఇవ్వాలి.

By:  Tupaki Desk   |   10 Feb 2025 2:30 PM GMT
కేంద్ర మంత్రి హిందీ పాట్లు.. ట్యూటర్ ను పెట్టుకుని ప్రత్యేక పాఠాలు
X

ఆయన పూర్తిగా దక్షిణాదికి చెందిన రాజకీయ నాయకుడు.. ఓ పెద్ద రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా.. దేశ ప్రధానిగా పనిచేసిన నాయకుడి కుమారుడైనా.. రాష్ట్రం దాటి బయటకు వెళ్లింది లేదు. అలాంటాయన తొలిసారి లోక్ సభ సభ్యుడు అయ్యారు. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖకు మంత్రి కూడా అయ్యారు. దీంతో దేశమంతా పర్యటించాలి. పైగా పార్లమెంటు సమావేశాల్లో వివిధ ప్రాంతాల ఎంపీలకు సమాధానం ఇవ్వాలి. దీంతో హిందీ నేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

హిందీ.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే అత్యంత కీలకం. ఎక్కువ శాతం ఎంపీలను ఈ భాష ద్వారానే రీచ్ కాగలం. అయితే, ఇంగ్లిష్ కూడా మాధ్యమంగా ఉన్నప్పటికీ హిందీనే ఎక్కువ సౌలభ్యం. ఈ నేపథ్యంలోనే దక్షిణాది నుంచి వెళ్లిన నేతలకు హిందీ రాకుంటే కమ్యూనికేషన్ సమస్య ఎదురవుతుంటుంది. ఇలాంటి సమస్యలోనే చిక్కుకున్నారు జేడీఎస్ అధినేత, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి.

కుమారస్వామి కర్ణాటకకు రెండుసార్లు సీఎంగా పనిచేశారు. ఈయన తండ్రి హెచ్ డీ దేవెగౌడ కూడా కర్ణాటకకు సీఎంగా వ్యవహరించారు. కన్నడ రాజకీయాల్లో వీరి కుటుంబానిది తిరుగులేని చరిత్ర. అయితే, 2023 మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ దారుణ ఫలితాలను చవిచూసింది. ఆ వెంటనే గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని రెండు సీట్లు నెగ్గింది. వీరిలో కుమారస్వామి ఒకరు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడంతో కేంద్ర మంత్రి అయ్యారు.

మోదీ క్యాబినెట్ లో కుమారస్వామికి కీలక ఉక్కు శాఖ మంత్రి పదవి దక్కింది. అయితే, హిందీ రాకపోవడంతో పార్లమెంటులో సమాధానాలు ఇవ్వడం, ఇతర సమయాల్లోనూ ఇబ్బంది అవుతుండడంతో హిందీ నేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం ట్యూటర్ ను పెట్టుకున్నారు.

కుమారస్వామి తండ్రి దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనూ హిందీ సమస్యను ఎదుర్కొన్నారు. 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం పుస్తకం కొని ప్రాక్టీస్ చేశారు. దాదాపు 30 ఏళ్ల అనంతరం కుమారస్వామి కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు.

కొసమెరుపు: కుమారస్వామి లోక్ సభ సభ్యుడు కాగా ఆయన తండ్రి దేవెగౌడ రాజ్యసభ సభ్యులు. 92 ఏళ్ల దేవెగౌడ ఇప్పటికీ పార్లమెంటుకు హాజరవుతుంటారు. వచ్చే ఏడాది జూన్ వరకు ఈ యన పదవీకాలం ఉంది.