Begin typing your search above and press return to search.

కుమారస్వామీ...ఇది ఏమీ ?

కేంద్రంలో ఉక్కు గనుల శాఖ మంత్రిగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ అధినేత కుమారస్వామి ఆరు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించారు.

By:  Tupaki Desk   |   26 Dec 2024 8:30 PM GMT
కుమారస్వామీ...ఇది ఏమీ ?
X

కేంద్రంలో ఉక్కు గనుల శాఖ మంత్రిగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ అధినేత కుమారస్వామి ఆరు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ని సందర్శించారు. కార్మికులు ఉద్యోగులతో మాట్లాడారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని ఆయన చూసి ప్లాంట్ కి భరోసా ఇచ్చారు. ప్రైవేటీకరణ వార్తల మీద కూడా కార్మికులు ఆయన దృష్టికి తీసుకుని వచ్చాను తాను తొందరలో కేంద్ర పెద్దలతో మాట్లాడి అన్నీ సానుకూలం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చి వెళ్లారు

అయితే విశాఖ ఉక్కు గతి మారలేదు సరికదా మరింతగా ప్రైవేటీకరణ సాగుతోంది. ఆఖరుకు విషయం ఎంత దాకా వచ్చిందంటే స్టీల్ ప్లాంట్ లోని అగ్నిమాపక విభాగాన్ని కూడా ప్రైవేట్ కి ఇచ్చేందుకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో పాటు సకాలంలో కార్మికులు ఉద్యోగులకు జీతాలు రాకపోవడంతో పాటు అనేక ఇతర సమస్యలతో ప్లాంట్ ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఇరవై వేల మంది దాకా ఉద్యోగులు కార్మికులు ఉన్న ప్లాంట్ ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు. లాభాల బాటలోకి ప్లాంట్ రావాలి అంటే పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్ధిక సాయం అందించాలని కోరుతున్నారు.

ఇటీవల విశాఖ ఎంపీ భరత్ కూడా కేంద్రం ప్యాకేజిని విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రకటించాలని కోరారు. ఈ నేపధ్యంలో కర్ణాటకలోని స్టీల్ ప్లాంట్ కి పది హేను వేల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. కుమార స్వామి సొంత రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థ విశ్వేశ్వరయ్య అండ్ ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ కి ఈ ప్యాకేజి దక్కడంతో విశాఖ ఉక్కు కార్మికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉక్కు మంత్రిగా ఉన్న కుమార స్వామి తన సొంత స్టేట్ బాగు కోసం చూడడంలో తప్పు లేదని అదే సమయంలో ప్రామిస్ చేసిన విధంగా విశాఖ ఉక్కు గురించి కూడా పట్టించుకోవాలి కదా అని అంటున్నారు.

ఇంతకీ చూస్తే కర్ణాటక స్టీల్ ప్లాంటులో పనిచేసేది 250 మంది ఉద్యోగులు మాత్రమే అని అంటున్నారు ఇరవై వేల మంది దాకా పనిచేసే విశాఖ ఉక్కు గురించి కేంద్రానికి ఎందుకు పట్టదని వారు అంటున్నారు. లక్షల కోట్ల పాయేకీజిని ఏమీ కోరలేదు కదా అంటున్నారు.

విశాఖ ఉక్కు పరిస్థితి ఇపుడు ఎటూ తేలకుండా అయోమయంగా ఉందని కూడా అంటున్నారు. మరో వైపు చూస్తే కీలకమైన ఉక్కు శాఖను కలిగిన ఉన్న కుమార స్వామి పార్టీ జేడీఎస్ కి ఉన్నది ఇద్దరే ఎంపీలు అంటున్నారు. ఆ ఇద్దరు ఎంపీలతోనే ఆయన కేంద్రం వద్ద తన పలుకుబడి ఉపయోగించి అక్కడ ఉక్కుని దన్నుగా నిలిచారని అంటున్నారు. ఏపీలో చూస్తే మొత్తానికి మొత్తం పాతిక మంది లోక్ సభ సభ్యులూ ఎన్డీయేకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చే వారే కదా అంటున్నారు. అయినా విశాఖ ఉక్కు ప్రైవేటుకు గురి అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నరు

విశాఖ ఉక్కు విషయంలో కుమార స్వామి మీద ఆశలు పెట్టుకుంటే ఇలా జరిగిందేంటి అని కూడా కార్మికులు తల్లడిల్లుతున్నారు. మరో వైపు చూస్తే స్టీల్ ప్లాంట్ కార్మికులకు వేతన బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుని పోయాయని అంటున్నారు. వాటిని తక్షణం చెల్లించాలని కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అదే విధంగా ప్లాంట్ కి సొంత గనులు కేటాయించి ఆర్థిక ప్యాకేజిని ప్రకటిస్తే బ్రహ్మాండంగా లాభాల బాట పడుతుందని అంటున్నారు. అదే సమయంలో సెయిల్ లో విలీనం చేయాలని కూడా కోరుకుంటున్నారు. మరి కర్ణాటకకు పెద్ద పీట వేసిన ఉక్కు మంత్రి విశాఖ దిక్కు వైపు చూస్తారా అన్నాదే చర్చగా ఉంది.