Begin typing your search above and press return to search.

దేశంలోనే నంబర్ వన్ గా విశాఖ స్టీల్ ప్లాంట్

విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏలినాటి శని వదిలేసినట్లుగా సీన్ చూస్తే అర్ధం అవుతోంది. దేశంలోనే సీ షోర్ స్టీల్ ప్లాంట్ గా అరుదైన ఘనతను సాధించింది విశాఖ ప్లాంట్.

By:  Tupaki Desk   |   18 Jan 2025 1:30 AM GMT
దేశంలోనే నంబర్ వన్ గా విశాఖ స్టీల్ ప్లాంట్
X

విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏలినాటి శని వదిలేసినట్లుగా సీన్ చూస్తే అర్ధం అవుతోంది. దేశంలోనే సీ షోర్ స్టీల్ ప్లాంట్ గా అరుదైన ఘనతను సాధించింది విశాఖ ప్లాంట్. అంతే కాదు మిగిలిన ప్లాంట్ లకూ విశాఖ స్టీల్ ప్లాంట్ కి మధ్య తేడా ఏంటి అంటే ఇది త్యాగాల పునాదుల మీద ఏర్పాటు అయిది.

విశాఖ స్టీల్ ప్లాంట్ కావాలని కోరుతూ 32 మంది తమ ప్రాణాలను పోరాటంలో పెట్టి అమరులు అయ్యారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నాడు ఉమ్మడి ఏపీ అంతా గర్జించింది. ఆంధ్రా తెలంగాణా తేడా లేకుండా అంతా ఉక్కు పోరాటానికి మద్దతుగా నిలిచారు.

అంతటి ఐక్యతను చూసి ఆనాడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కీలక ప్రకటన చేసేంతవరకు ఉద్యమం సాగింది. ఉక్కు మహిళ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విశాఖకు వచ్చి స్టీల్ ప్లాంట్ కి పునాది రాయి వేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వస్తే చాలు తమ జీవితాలు బాగుపడతాయని ఉత్తరాంధ్ర బంగారం అవుతుందని భావించి స్వచ్చందంగా తమ భూములను వేలాదిగా ఇచ్చారు ఆనాటి విశాఖ ప్రజలు. అలా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడమే కాదు ఉత్పత్తిలోనూ ఎన్నో రికార్డులను నెలకొల్పింది. విశాఖ ఉక్కులో తయారు అయ్యే స్టీల్ కి అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేయాలే కానీ దేశంలోనే ఏ స్టీల్ ప్లాంట్ కి దక్కని లాభాలను అందిస్తుందని నిపుణులు చెబుతారు. అటువంటి స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు లేక నష్టాలు వస్తున్నాయి. ముడి సరుకు అందకపోవడం వల్లనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

విశాఖ ఈ రోజు ఆర్ధిక రాజధానిగా ఉంది అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు కావడం వల్లనే అన్నది కూడా అందరికీ తెలుసు. విశాఖ మినీ ఇండియాగా మారినా దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఎంతో మంది విశాఖకు ఉపాధి కోసం ఇతర వ్యాపారాల కోసం వచ్చినా ఆ ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్ దే అవుతుంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిన తరువాత మరిన్ని అనుబంధ సంస్థలు కూడా వచ్చి ఉపాధి అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది కేంద్ర బిందువుగా ఉంది. అది కనుక లేకపోయినా ప్రైవేట్ పరం అయినా విశాఖ ఫ్యూచర్ కి కూడా ఇబ్బందిగా ఉంటుందని చెబుతారు.

అందుకే ఆంధ్రుల సెంటిమెంట్ గా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడానికి గట్టి ప్రయత్నం జరిగింది. దానికి ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించింది. మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కి కొత్త జీవితమే ప్రసాదించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కి చీకటి రోజులు ముగిసాయని కేంద్ర పెద్దలు అంటున్నారు. స్వయంగా ఉక్కు శాఖ మంత్రి అయిన కుమార స్వామి మాట్లాడుతూ విశాఖ ఉక్కులో ఇక ప్రైవేటీకరణ అన్న మాటే ఉండదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటలోకి తీసుకుని రావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ ఆర్ధిక ప్యాకేజీ ఆరంభం మాత్రమేనని మరిన్ని ఆర్ధిక ప్యాకేజీలు కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఇస్తామని ఆయన భారీ హామీ ఇచ్చారు. అంతే కాదు రానున్న రెండు మూడేళ్ళలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని దేశంలోనే నంబర్ వన్ గా చేస్తామని కుమార స్వామి ప్రకటించడం విశేషం. మొత్తానికి విశాఖ ఉక్కు కర్మాగారం మీద కేంద్రం పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తుంది అన్నది అర్ధం అయింది. దాంతో ఆంధ్రుల సెంటిమెంట్ గెలిచింది అని అంతా అంటున్నారు.