కుమారస్వామి అభయంతో ఆగుతుందా ?
ఆయన మొత్తం ప్లాంట్ లోని కీలక విభాగాలను అన్నింటినీ తనిఖీ చేశారు.
By: Tupaki Desk | 2 Dec 2024 8:30 PM GMTకేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ని సందర్శించారు. ఆయన మొత్తం ప్లాంట్ లోని కీలక విభాగాలను అన్నింటినీ తనిఖీ చేశారు. ప్లాంట్ కి ఫ్యూచర్ ఉందని అన్నారు. లాభాల బాట పట్టిస్తామని అన్నారు. ప్రైవేట్ పరం చేయకుండా చూస్తాను అని హామీ ఇచ్చారు.
ఇది జరిగి అయిదు నెలలు గడుస్తోంది. ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అన్న మీద స్పష్టమైన ప్రకటన అయితే లేదు. దాంతో పాటుగా జోరుగా ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందని ఉక్కు ఉద్యోగ సంఘాలతో పాటు ప్రజా సంఘాలు కార్మిక నేతలు అంతా విమర్శిస్తున్నారు.
లేటెస్ట్ గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. దాంతో ఏపీకి చెందిన అధికార విపక్షాలు విశాఖ ఉక్కు విషయంలో తాము మాట్లాడుతామని అంటున్నారు. వీరంతా ఉక్కు మంత్రి కుమారస్వామిని కలసి వినతిపత్రాలు ఇస్తున్నారు. ఆయన కూడా విశాఖ ఉక్కు విషయంలో తాను సానుకూలంగా ఉన్నానని కుమారస్వామి చెబుతున్నారు. వచ్చే వారం జరిగే కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో విశాఖ ఉక్కుని లాభాల బాటలో పెట్టే విషయంలో తన ప్రతిపాదనలు పెడతాను అన్నారు.
టీడీపీ ఎంపీలు అయినా వైసీపీ ఎంపీలు అయినా కుమారస్వామిని కలుస్తున్నారు ఆయన సంబంధిత శాఖ మంత్రి కాబట్టి కలవడంలో తప్పు లేదు కానీ ఏపీకి చెందిన మొత్తం పాతిక మంది లోక్ సభ ఎంపీలు ఏడుగురు రాజ్యసభ సభ్యులు అందరూ ఒకేసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలసి ఉక్కు కర్మాగారం విషయంలో ప్రైవేట్ పరం చేయవద్దు అని గట్టిగా చెప్పవచ్చు కదా అన్న మాట అయితే వినిపిస్తోంది.
విశాఖ ఉక్కు విషయంలో ప్రధాని స్థాయిలోనే పరిష్కారం ఉంటుందని వామపక్ష నేతలు అంటున్నారు. కేంద్రం అయితే 2021లోనే దీని మీద విధానపరమైన డెసిషన్ ని ప్రకటించింది. దాని ప్రకారమే ముందుకు పోతోంది. ఇపుడు మళ్లీ వెనక్కి తీసుకోవాలంటే ప్రధాని మోడీ నుంచి భేటీ వేస్తేనే జరిగే పని అంటున్నారు. లేకపోతే కూటమి ఎంపీలు అయినా వైసీపీ ఎంపీలు అయినా ఉక్కు విషయంలో చేసేది మొక్కుబడి పోరాటమే అని అంటున్నారు.